హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): దేశంలోని వివిధ ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) -2025 నోటిఫికేషన్‌ను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. జాతీయంగా నిర్వహించే ఈ పరీక్షలు మార్చి 1 నుంచి జూన్ వరకు నిర్వహిస్తారు. శుక్ర, శనివారాల్లో మాత్రమే ఈ పరీక్షలను నిర్వహించనుండగా, శుక్రవారం కేవలం మధ్యాహ్నం, శనివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో పరీక్షలు ఉంటాయి. రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్ సహా గ్రేటర్ పరిధిలో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ పరీక్ష స్కోర్ ఆధారంగానే జాతీయంగా 142 కాలేజీల్లోని సీట్లను భర్తీ చేయనుండగా, నాటా స్కోర్‌ను రెండేండ్లపాటు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.