BRS | నల్లబెల్లి,/ నర్సంపేట ఏప్రిల్ 21 : వృద్ధుల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్థిరస్థాయిగా నిలిచిపోతాడు అన్న దానికి వృద్ధురాలు నీలమ్మే సాక్ష్యంగా నిలిచింది. నర్సంపేట పట్టణ కేంద్రంలో వృద్ధాప్య పెన్షన్‌ను రజతోత్సవ సభకు అందజేసి ఆ వృద్ధురాలు అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా వృద్ధురాలు నీలమ్మను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అభినందించారు.
ఈ సందర్భంగా మాజీ పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలతో వృద్ధులు, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని స్పష్టం చేశారు. ఈనెల 27న కేసీఆర్ తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున జరగనున్న నేపథ్యంలో అందుకు అయ్యే ఖర్చుల కోసం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం రూరల్ మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన బయ్య నీలమ్మ అనే వృద్ధురాలు తనకు నెలకు రూ.2 వేల చొప్పున కేసీఆర్ అందించిన పెన్షన్ ను తన కుమారుడు భయ్యా నవీన్‌తో కలిసి నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అందజేసింది.
ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధురాలు తన ఒక నెల పెన్షన్‌ను విరాళంగా ఇవ్వడం, వృద్ధులు, ప్రజలు, పేదోళ్ల గుండెల్లో మాజీ సీఎం కేసీఆర్ పాతుకుపోయారని అందుకు ఈ సంఘటన ఉదాహరణ బయ్య నీలమ్మ అని మాజీ ఎమ్మెల్యే పెద్ది అన్నారు. కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలతో పెన్షన్లు ఇతర లబ్ధిలు డబ్బులు పోగుచేసుకొని గ్రామ గ్రామాల నుంచి రజతోత్సవ సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన వితంతు వృద్ధ మహిళ నీలమ్మ తను కేసీఆర్ వల్ల లబ్ధి పొందానని కృతజ్ఞతతో ఒక నెల పెన్షన్ రూ.2వేలకు రజతోత్సవ సభ నిర్వహణ ఖర్చు కోసం విరాళంగా అందించడం అభినందనీయమని అన్నారు. విరాళం అందించిన నీలమ్మ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా వితంతు పెన్షన్ లబ్ధిదారురాలు నీలమ్మ మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు గత ప్రభుత్వాలు నెలకు 200 మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని.. కేసీఆర్ సార్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి 2 వేల రూపాయల పెన్షన్ అందించడం జరిగిందని తెలిపారు. సార్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్లు అందించి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఖర్చుల కోసం తన వంతుగా సహాయం అందించడం సంతోషకరంగా ఉందని నీలమ్మ అన్నారు.