వరంగల్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని పోలీసులు ధ్వంసంచేసి, తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన నర్సంపేట నియోజకవర్గ బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లోని వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాలు, పెట్రోల్ బంక్‌లు బంద్ పాటించాయి. ప్రభుత్వ పాఠశాలలు బంద్ పాటించాలని బీఆర్ఎస్ శ్రేణులు విజ్ఞప్తి చేశాయి. ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులు సైతం సంఘీభావం ప్రకటించి బంద్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు. వ్యాపారులు తమ సంస్థలను స్వచ్ఛందంగా మూసి బంద్‌కు సహకరించారు.
బంద్ సందర్భంగా నర్సంపేట పట్టణంతోపాటు అన్ని మండల కేంద్రాల్లోని ప్రధాన రహదారులు, వాణిజ్య ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు, బైక్ ర్యాలీలు చేపట్టారు. మహబూబాబాద్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తిరిగి వెంటనే ప్రతిష్ఠించాలని, బీఆర్ఎస్ కార్యకర్తలపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని అన్నిచోట్ల నినదించారు. చెన్నారావుపేట మండల కేంద్రం సహా మరికొన్ని ప్రాంతాల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపూర్, నర్సంపేటలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నెక్కొండలోని అంబేద్కర్ కూడలిలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ తొలగింపునకు నిరసనగా నియోజకవర్గ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌లోని వరంగల్, హనుమకొండ, నర్సంపేట, మహబూబాబాద్, జనగామ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేసింది. నర్సంపేట మెడికల్ కాలేజీ సమీపంలోని ఓ ప్రైవేట్ స్థలంలో పెట్టిన సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని పోలీసులు సోమవారం అర్థరాత్రి దాటాక తొలగించారు. దీంతో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకించి నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రాష్ట్ర రుణ విమోచన కమిషన్, కుడా మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి సహా పలువురిని వరంగల్, హనుమకొండల్లో గృహ నిర్బంధం విధించి, పలువురిని అరెస్టులు చేశారు. హైదరాబాద్ నుంచి నేరుగా నర్సంపేటకు వెళ్తున్న ఆయనను జనగామలోనే హైవేపై మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో ఆయన అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాడు. పోలీసులు బలవంతంగా జనగామ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. హైదరాబాద్‌కు వెళ్తానంటే విడుదల చేస్తామని, పోలీసులు షరదు విధించారు. దీంతో ఒప్పుకున్న ఎర్రబెల్లిని పోలీస్‌స్టేషన్ నుంచి విడుదల చేయడంతో పాటు ఎస్కార్ట్ ఇచ్చి తరలించారు.

జనగామ, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో అరాచక పాలన నడుస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. జనగామ పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు, అధికారులు పాలకులకు, కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. పెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన నర్సంపేట బంద్ విజయవంతమైందని, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని తెలిపారు. పెద్ది విగ్రహాన్ని ఓ దాత ఇచ్చిన ప్రైవేట్ స్థలంలో పెడితే కూలగొడతారా? అని ప్రశ్నించారు. కొందరు అధికారులు తప్పులు చేస్తున్నారని, వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బంద్‌ను విఫలం చేయడానికి ఉదయం నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక మంది నాయకులను హౌస్ అరెస్ట్ చేశారని తెలిపారు. అనేక దిగ్బంధాల మధ్య, పార్టీ శ్రేణులు, రాజకీయాలకతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారని కొనియాడారు.