హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): వైద్య విద్య సంచాలకుడిగా(డీఎంఈ) డాక్టర్ నరేంద్రకుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియార్టీ ప్రకారం రెగ్యులర్ డీఎంఈని నియమించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. నరేంద్రకుమార్ ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. డీఎంఈ(అకడమిక్)గా శివరాంప్రసాద్‌ను నియమించారు. ఆయన జగిత్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం డీఎంఈ పోస్టు ఏపీకి వెళ్లిపోగా.. ప్రభుత్వం తాజాగా డీఎంఈ, డీపీహెచ్, టీవీవీపీ కమిషనర్ పోస్టులను సృష్టించింది. శుక్రవారం వీరు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్యుల సంఘం(టీజీజీడీఏ) వారికి అభినందనలు తెలిపింది.
బీసీలు ధర్మపోరాటానికి సిద్ధం కావాలి : కుమారస్వామి
హైదరాబాద్, జనవరి24 (నమస్తే తెలంగాణ): బీసీలు తమ హక్కుల కోసం ధర్మపోరాటానికి సిద్ధం కావాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వెంటనే బీసీ కులగణన చేపట్టాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని, ఓబీసీల కేంద్ర జాబితాను గ్రూపుల వారీగా వర్గీకరించాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నేడు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.