Telangana | నారాయణపేట నియోజకవర్గంలోనే అత్యంత దరిద్రమైన శాఖగా విద్యుత్ శాఖ నిలిచిందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు. పనిచేయడం ఇష్టం లేకపోతే బదిలీ చేసుకోండని అధికారులకు సూచించారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో గురువారం నాడు మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో 24 గంటలు ఉంటున్న కరెంటు ఇప్పుడు ఎందుకు ఉండటం లేదని విద్యుత్ ఉద్యోగులను ఎమ్మెల్యే నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు స్తంభాలు ఇచ్చారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.