హైదరాబాద్ : ప్రధాని మోదీ విదేశీ పర్యటనలతో ఎలాంటి ప్రయోజనం లేదని, బిహార్లో జనం వరదలతో అల్లాడిపోతుంటే కనీసం సందర్శించలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ( Narayana) మోదీపై(PM Modi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బిహార్లో 22 జిల్లాల్లో వరద బీభత్సం(Bihar floods) సృష్టించింది. ముఖ్యంగా 12 జిల్లాల్లో తీవ్రంగా నష్టం జరిగింది. దాదాపు నాలుగైదు లక్షల మంది కుటుంబాలు బయటకు వచ్చేశారు. కొన్ని ఇల్లు నీళ్లలోనే ఉండిపోయాయన్నారు.
బిహార్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల పంట పూర్తిగా నాశనం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో కొట్టుకుపోయిన కొంతమంది శవాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇంత భయానక పరిస్థితుల్లో కూడా మోదీ పర్యటన చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్ పర్యటన చేయడు, మణిపూర్లో రావణ కాష్టం అంటే పడదు. కానీ విదేశాలలో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ప్రధాన మంత్రి తిరుగుతున్నాడని మండిపడ్డారు.
డేరా బాబుకు బెయిల్ ఇచ్చారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే బెయిల్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.వరవర రావు లాంటి వాళ్లకు బెయిల్ రాదు, వచ్చిన ఎన్నో కండీషన్స్ పెడుతారన్నారు. బీజేపీ జమ్ము కశ్మీర్లో బీజేపీ దొడ్డిదారిలో అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. మరోవైపు నక్సలిజం పైన అమిత్ షా సమావేశంపై ఆయన స్పందించారు. దేశంలో రేపులు, మర్డర్స్ జరుగుతున్నాయి. వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. అన్నలు ఆలోచించాలి, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాల్లో మార్పులు తెచ్చుకోవాలన్నారు. ప్రజలతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.