హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపిన రూ.కోటి నగదు పారితోషికం, ఇంటిజాగను ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తిరసరించడం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. రాష్ట్ర అస్తిత్వ పరిరక్షణలో సిధారెడ్డి చూపిన నిబద్ధత, తెగువ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుందని చెప్పారు. సిధారెడ్డి నిర్ణయంపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్రపోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని శనివారం అల్వాల్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ స్మృతులను నెమరువేసుకున్నారు. ప్రభుత్వమే తెలంగాణ అస్తిత్వంపై కుట్రలు చేస్తున్న తరుణంలో తెలంగాణ సమాజానికి నందిని సిధారెడి గట్టి సందేశం ఇచ్చారని తెలిపారు. ‘తెలంగాణ బిడ్డలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా వెనకాడరని సిధారెడ్డి తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయం సమాజానికి గొప్ప సందేశం ఇచ్చింది.
తెలంగాణ అస్తిత్వంపై సాగుతున్న దాడుల నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండి తమ హకులను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం మరోసారి ఐక్యంగా పోరాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో కవులు, కళాకారులు ఎప్పుడూ ముందుంటారు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి తన సాహిత్యాన్ని కేటీఆర్‌కు అందజేశారు. ఎమ్మెల్సీ దేవపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీ ప్రసాద్, గజ్జెల నగేశ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పార్టీ సీనియర్ నేతలు దాసోజు శ్రవణ్‌కుమార్, కొణతం దిలీప్ పాల్గొన్నారు.