TTD | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన నేపథ్యంలో లడ్డూ తయారీలో మళ్లీ నందిని నెయ్యినే వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. 2024-25 సంవత్సరంలో టీటీడీకి 350 మెట్రిక్ టన్నుల నెయ్యిని సరఫరా చేయాలని ఆర్డర్ ఇచ్చారు. కిలో నందిని నెయ్యిని 478 రూపాయల చొప్పున టీటీడీ కేఎంఫ్ నుంచి కొనుగోలు చేయనున్నది. గతంలో 2013-14 నుంచి 2021-22 వరకు 5వేల టన్నుల నెయ్యిని కేఎంఎఫ్ సరఫరా చేసింది. 2022-23లో అధిక ధర ఉందనే కారణంతో నందిని నెయ్యి టెండర్‌ను వైసీపీ ప్రభుత్వం తిరస్కరించింది.
తిరుమల ఆలయ పవిత్రతను కాపాడేందుకు టీటీడీ ఉపశమన చర్యలకు ఉపక్రమించింది. శనివారం ఈవో శ్యామలారావు ఆధ్వర్యంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతియాగం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
టీటీడీకి పాల ఉత్పత్తులు సరఫరా చేసేందుకు తెలంగాణ విజయ డెయిరీ సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థకశాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు. ఈ మేరకు టీటీడీ ఈవో జే శ్యామలరావుకు శనివారం లేఖ ద్వారా ప్రభుత్వ ప్రతిపాదనను వెల్లడించారు. విజయ డెయిరీ ఉత్పత్తుల్లో నాణ్యతను నిర్ధారించడంతోపాటు లక్షలాది మంది పాడి రైతుల జీవనోపాధికి సంస్థ తోడ్పడుతుందని పేర్కొన్నారు.