Runa Mafi | కరీంనగర్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/హుస్నాబాద్‌టౌన్): రైతు రుణమాఫీ ఒక మాయగా మారింది. వ్యవసాయ శాఖ తాజా చేపట్టిన సర్వేలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సర్వే నిమిత్తం వ్యవసాయ శాఖ అధికారులకు పంపించిన జాబితాల్లో అన్ని అర్హతలు ఉండీ రుణమాఫీ కానీ లక్షలాది రైతుల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో తమ పేర్లు, డాటా ఎందుకు కనిపించడం లేదో అర్థం కాక, తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, అడిగినా ఎవరి నుంచీ స్పష్టత రాక లక్షలాది రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో రుణమాఫీ జరగలేదంటూ 1,400కుపైగా ఫిర్యాదులొచ్చాయి. ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ అధికారులకు వచ్చిన రుణమాఫీ కాని జాబితాను ఫిర్యాదుదారుల ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసి వెరిఫై చేస్తే, 850కిపైగా రైతుల పేర్లకు సంబంధించిన డాటా ‘నాట్ ఫౌండ్’ అని చూపిస్తున్నది. రైతులు బ్యాంకుకు వెళ్లి అడిగితే.. అగ్రికల్చర్ అధికారులనే అడగాలని సమాధానమిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట కెనరాబ్యాంకు శాఖ పరిధిలో వేయికిపైగా రైతుల పరిస్థితి ఇలానే ఉన్నది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కెనరా బ్యాంకు పరిధిలోని వందలాది రైతుల దుస్థితి ఇదే. ఒకటి రెండు బ్యాంకులో, ఒకటి రెండు గ్రామాల సమస్య మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది డాటా ‘నాట్ ఫౌండ్’ అని చూపిస్తున్నది.
అసలేం జరిగింది?
తొలుత అందరికీ రుణమాఫీ చేశామని ప్రకటించిన ప్రభుత్వం, చివరకు రైతులు రోడ్లపైకి రావడంతో వాస్తవాన్ని అంగీకరించింది. క్షేత్రస్థాయి సర్వే చేయించి వారి వివరాలు నమోదు చేసి దశలవారీగా రుణమాఫీ వర్తింప చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఆగస్టు 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తారని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, అధికారులు మాత్రం ఇండ్లకు వెళ్లకుండా క్లస్టర్‌వారీగా రైతులను రైతువేదికల వద్దకు పిలుస్తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటికే 31 సాంకేతిక సమస్యల కారణంగా అందరికీ మాఫీ కాలేదని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో రుణమాఫీ కాని రైతుల కోసం సర్వే చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అందరి వివరాలు తీసుకుంటారని రైతులు భావించారు. కానీ, అలా జరగడం లేదు. సర్వే పేరిట ఒక యాప్ ఇవ్వడంతోపాటు ఒక జాబితాను ప్రభుత్వం పంపింది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు.. ఆ జాబితాలో ఉన్న రైతుల వివరాలను మాత్రమే పరిశీలించి, ఫొటోలు తీసి స్వీయ ధ్రువీకరణ పత్రం తీసుకొని యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ జాబితాను పరిశీలిస్తే, కేవలం రేషన్‌కార్డు అర్హత ఉండి, రుణమాఫీ జరగని రైతుల పేర్లతో కూడిన జాబితాను మాత్రమే ప్రభుత్వం పంపించినట్టు స్పష్టమవుతున్నది. 31 సాంకేతిక అంశాలతో సమస్యలు ఏర్పడి రుణమాఫీ జరగకపోతే, కేవలం రేషన్‌కార్డు సంబంధిత సమస్యను మాత్రమే ప్రస్తుత తాజా సర్వేలో పరిగణనలోకి తీసుకోవడం వల్ల.. మిగిలిన వారి పేర్లు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద ఉన్న జాబితాలో కనిపించడం లేదని తెలుస్తున్నది..
ఏదీ స్పష్టత?
రుణమాఫీ జరగలేదంటూ వస్తున్న ఫిర్యాదులను అధికారులు కొన్నిచోట్ల స్వీకరిస్తుండగా, మరికొన్ని చోట్ల తీసుకోవడం లేదు. దరఖాస్తులను ఏమి చేయాలన్న దానిపై ప్రభుత్వం అధికారులకు స్పష్టత ఇవ్వలేదు. రేషన్‌కార్డు యేతర సమస్యలతో రుణమాఫీ కాకుండా నిలిచిపోయిన రైతుల గురించి తిరిగి సర్వే చేస్తారా? లేదా? సదరు రైతులకు రుణమాఫీ వర్తింపచేస్తారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం లభించడంలేదు. రుణమాఫీ వర్తించని రైతులందరికీ ఒకేసారి సర్వే చేసి.. వారి వివరాలు నమోదు చేసుకొని రుణమాఫీ వర్తింప చేయాలే తప్ప.. ఒకసారి రేషన్‌కార్డుతో కూడిన సమస్యలు.. మరోసారి మరో సమస్య అంటూ సర్వే చేసుకుంటూ వెళ్తే మరో మూడు నాలుగు నెలలకుపైగా సమయం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మేమేం పాపం జేసినం
2018లో కెనరాబ్యాంక్ నుంచి రూ.లక్షన్నర అప్పు తీసుకున్న. సంవత్సరానికోసారి మిత్తి కట్టి రెన్యువల్ జేస్తున్న. అయినా నాకు రుణమాఫీ గాలేదు. ఏం పాపం సేసినమో అర్థం అయితలేదు. రోజూ బ్యాంకు సుట్టూ అగ్రికల్చర్ ఆఫీస్ సుట్టూ తిరుగుతునే ఉన్నం. అసలు మా పేర్లు ఎందుకు మాయమైందో ఎవరూ జెప్పడం లేదు.
-దేవసాని శ్రీనివాసరెడ్డి, రైతు, పొట్లపల్లి, హుస్నాబాద్ మండలం
మంత్రికి చెప్పినా గాలే !
2018లో అప్పుతీసుకున్నం. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంట వస్తన్నం. ఇప్పుడు మాఫీ గాలే. బ్యాంకుకు వెళ్లి అడిగితే లిస్టు పంపినమన్రు. అగ్రికల్చర్ అఫీసుకు పోయి అడిగితే.. మమ్మల్ని ఏం జేయమంటవు? నీ ఆధార్ కొడితే నో డాటా ఫౌండ్ అని సూపెడుతున్నది. ఇంకోసారి మా దగ్గరకి రాకండి అని సెప్పుతున్రు. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి రుణమాఫీ కాని జాబితా ఇచ్చిన. సూత్తం సేత్తం అని అన్నరు కాని మాఫీ అయితే కాలేదు.
– గడ్డం ప్రవీణ్‌రెడ్డి, రైతు, రేగొండ, అక్కన్నపేట మండలం