హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 10 (నమస్తే తెలంగాణ) : ‘హలో… నమస్తే తెలంగాణ విలేకరా? ఎంఎన్జేలో మందులు లేవని ఎవరు చెప్పారు? ఎవరో చెబితే రాసేస్తారా? మేం తల్చుకుంటే నీ కెరీర్ పాడైతది.. కేసులు పెడతాం ఖబడ్దార్…’ ఇదీ రెండు రోజుల కిందట ఓ మహిళ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధికి వచ్చిన బెదిరింపు కాల్. మరి ఎంఎన్జేలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆ మహిళకు ఎందుకు కోపం వచ్చింది? ఇంతకీ ఆమె ఆసుపత్రిలో పని చేస్తారా? కనీసం వైద్యారోగ్య శాఖలో మరెక్కడైనా పని చేస్తారా? అనే సందేహాలపై లోతుగా విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది.
క్యాన్సర్ రోగులకు పునర్జన్మనిచ్చే ఎంఎన్జే ఆసుపత్రికి ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో అంతా తెలిసిందే. తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా దేశంలో ఎక్కడెక్కడి నుంచో రోగులు ఇక్కడికి వచ్చి వైద్యసేవలు పొందుతారు. అంతటి కీలకమైన దవాఖానలో కొంతకాలంగా మందుల కొరత ఉంది. ప్రధానమైన వైద్య పరికరాలు పని చేయడం లేదు. అంతటి దయనీయ స్థితిని తెలుసుకున్న ‘నమస్తే తెలంగాణ’ రోగులకు మేలు జరగాలనే ఉద్దేశంతో రెండు రోజులుగా సమస్యలపై కథనాలను ప్రచురిస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం ‘క్యాన్సర్ రోగులకు కాంగ్రెస్ శాపం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి తీవ్రంగా స్పందించిన ఒక మహిళ అదే రోజు రాత్రి పత్రిక ప్రతినిధికి ఫోన్ చేశారు. ఎంఎన్జే దవాఖానలో పరికరాలు పని చేస్తలేవని, మందులు లేవని ఎవరు చెప్పారు? రోగులు చెబితే రాసేస్తారా? వారికేం తెలుసు? అని ఆయనపై మండిపడ్డారు. మేం తలుచుకుంటే మీ కెరీర్ ఖతమైపోతదని, మళ్లీ రాస్తే కేసులు పెడుతామని అల్టిమేటం ఇచ్చి ఫోన్ కట్ చేశారు.
పత్రికల్లో ఏదైనా వ్యతిరేక కథనాలు వస్తే సంబంధించిన సంస్థ అధిపతి ఫోన్ చేసి వివరణ ఇస్తారు, ఆరా తీస్తారు. సంస్థాపరంగా లిఖితపూర్వక ఖండననో, వివరణనో ఇస్తారు. అలాగే ఎంఎన్జే అనే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా సమస్యలను ఎత్తి చూపినప్పుడు సంబంధిత అధికారులు స్పందించాలి. ఈ విషయమై ఫోన్ చేసిందెవరో అని ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ఆరా తీయగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అసలు ఆమెకు దవాఖానకు సంబంధం లేదని, ఆమె ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్యాకల్టీ అని తెలిసింది. ఆమె భర్త మాత్రం ఆసుపత్రిలో కీలకమైన వైద్యాధికారిగా ఉన్నారని, అక్కడి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన అధికారి అది చేయకుండా సమస్యల్ని వెలుగులోకి తెచ్చిన మీడియాను బెదిరించడానికి భార్యను పురమాయించడంపై వైద్యవర్గాలే నవ్వుకుంటున్నాయి.
నల్లగొండ జిల్లాకు చెందిన ఒక రోగికి ఇటీవలే రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స జరిగింది. కీమో థెరపీ పూర్తైంది, రేడియేషన్ థెరపీ ఇస్తున్నారు. మొత్తం 15 ఫ్యాక్షన్స్ రేడియేషన్ ఇవ్వాల్సి ఉండగా డిసెంబరు 1వ తేదీ వరకు 13 ఫ్యాక్షన్స్ పూర్తయ్యాయి. మరో రెండు ఇస్తే రోగి చికిత్స పూర్తవుతుంది, ఇంటికి వెళ్లిపోవచ్చు. అయితే రేడియేషన్ థెరపీ యంత్రాలు పనిచేయకపోవడంతో ఈనెల 2 నుంచి చికిత్స ఆగిపోవడంతో రోగికి నిరీక్షణ తప్పడం లేదు. ఆ యంత్రాలు ఎప్పుడు బాగు చేయిస్తారో, చికిత్స ఎప్పుడు జరుగుతుందో అని రోగి కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
రేడియేషన్ థెరపీ కోసం ఇప్పటికే దవాఖాన దగ్గర్లోనే అద్దె రూములు తీసుకుని ఉంటున్నామని, పనులు మానుకుని రోగితో పాటు ఉండాల్సి వస్తున్నదని కుటుంబ సభ్యులు వాపోయారు. 3న పూర్తి కావాల్సిన చికిత్సా యంత్రాల రిపేర్ ఇంకా కాకపోవడం, వారం పాటు నగరంలోనే ఉండాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజులుగా రేడియేషన్ థెరపీ యంత్రాలు పనిచేయకపోవడంపై వార్తలు రాసినందుకు ఇలా రియాక్ట్ కావడం విమర్శలకు తావిస్తున్నది.