హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు 1,443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఈ ఏడాది పరీక్షలకు 9.07 లక్షల విద్యార్థులు హాజరుకాబోతున్నట్టు తెలిపారు. పరీక్షల నేపథ్యంలో సోమవారం జలీల్ ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో చలువపందిళ్లు, టెంట్లు, తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులకు చల్లటి మంచినీళ్లను అందజేస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఏఎన్ఎంలు సేవలందిస్తారని, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఈ నెల 6 నుంచి 23 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 8:30 గంటలలోపే పరీక్షాకేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. సకాలంలో విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నదని తెలిపారు. పరీక్షలు పూర్తయిన నెలలోపే ఫలితాలు వెల్లడిస్తామని, ఫలితాలు వచ్చిన నెల రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు పరీక్షల భయం, టెన్షన్‌ను దూరం చేసేందుకు 1800 5999 333 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని వివరించారు.
మాస్క్ మస్ట్
కొవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలని, మాస్క్‌లు లేని వారికి ఉచిత మాస్క్‌లు అందజేస్తామని జలీల్ తెలిపారు. వ్యాక్సినేషన్ పూర్తయిన వారికే పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించామని పేర్కొన్నారు. జ్వరం, జలుబు వంటి లక్షణాలున్న వారికి ప్రతీ పరీక్షా కేంద్రంలో రెండు ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
సెల్ఫ్ డౌన్లోడెడ్ హాల్‌టికెట్లు
ఫీజు చెల్లించలేదన్న సాకుతో పలు కాలేజీలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టుగా ఫిర్యాదులందుతున్నాయని జలీల్ తెలిపారు. రెండు కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీచేశామన్నారు. విద్యార్థుల ఇబ్బందులు తొలగించేందుకు సెల్ఫ్ డౌన్లోడెడ్ హాల్‌టికెట్లతో పరీక్షలకు అనుమతించాలని నిర్ణయించామని వెల్లడించారు. ఇంటర్‌బోర్డు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
1.50లక్షల విద్యార్థులకు స్టడీమెటీరియల్..
ముఖ్యమైన ప్రశ్నలతో బోర్డు స్టడీ మెటీరియల్‌ను తయారుచేసిందని జలీల్ తెలిపారు. ఈ మెటీరియల్‌ను తెలుగు అకాడమీ ద్వారా ముద్రించి, రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీలు, మాడల్స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల విద్యాలయాల సొసైటీల్లోని 1.50లక్షల విద్యార్థులకు అందజేశామని వివరించారు. వెబ్సైట్లోనూ ఈ మెటీరియల్ అందుబాటులో ఉన్నదని తెలిపారు.
వెబ్సైట్లో ఇంటర్ హాల్‌టికెట్లు
ఇంటర్ విద్యార్థులు తమ హాల్‌టికెట్లను https: //tsbie.cgg. gov. in, https: //tsbieht.cgg. gov. in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశించారు. హాల్‌టికెట్‌లో ఏవైనా తప్పులు దొర్లితే ప్రిన్సిపాళ్ల ద్వారా డీఐఈవోలను సంప్రదించి తక్షణమే సవరించుకోవాలని సూచించారు.