‘తెలంగాణ వచ్చాక నిరంతర విద్యుత్తు , ప్రభుత్వ పాలసీ వెరసి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఆకాశమంత పెరిగింది. ముఖ్యమంత్రి దూరదృష్టితో పారిశ్రామికరంగానికి తెలంగాణ సుస్థిరమైన గమ్యస్థానంగా ఎదిగింది’ అంటున్నారు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ)-తెలంగాణ చైర్మన్, కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షులు సి.శేఖర్‌రెడ్డి. దశాబ్ది తెలంగాణలో జరిగిన విప్లవాత్మక మార్పులపై ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా సంభాషించారు.
తెలంగాణ రాష్ర్టానికి ఐటీఐఆర్ మంజూరుచేస్తే ఎంతో బావుంటుంది. ఐటీలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర ఇతర నగరాలకు కూడా విస్తరిస్తున్నది. వరంగల్‌లో దాదాపు పది పెద్ద ఐటీ కంపెనీలు ఉండగా, వాటిలో దాదాపు ఆరువేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ర్టానికి ఐటీఐఆర్ మంజూరుచేస్తే ఐటీలో తెలంగాణకు తిరుగు ఉండదు.
టీఎస్ ఐ-పాస్ చట్టం తెలంగాణ పారిశ్రామికరంగంలో ఓ విప్లవాత్మకమైన ముందడుగని చెప్పవచ్చు. సింగిల్ విండో ద్వారా శీఘ్రగతిన అనుమతులు ఇవ్వడంవల్ల పెట్టుబడిదారుల వ్యయప్రయాసలు తగ్గాయి. ఇతర రాష్ర్టాల విషయానికొస్తే, అనుమతులకు సంబంధించి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతి అమలవుతున్నది. వాటితో పోలిస్తే టీఎస్ ఐ-పాస్ ఎంతో మెరుగైందనడంలో సందేహం లేదు.

తెలంగాణలో పారిశ్రామికరంగ పురోగతి ఎలా ఉన్నది?
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ పారిశ్రామికరంగ పురోగతి ఊహించిన దానికన్నా గొప్పగా ఉన్నది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. మరెన్నో సంస్థలు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు, భూముల ధరలు అందుబాటులో ఉండటం, జీవన వ్యయం తక్కువగా ఉండటం, విద్య, వైద్యం తదితర మౌలిక వసతులు బాగున్నా యి. నైపుణ్యం గల సిబ్బందికి ఇక్కడ కొదువ లేదు. ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ మెరుగ్గా ఉన్నది. ఇవన్నీ తెలంగాణ రాష్ర్టాన్ని, హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు గమ్యంగా మార్చాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ విశ్వవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌ను ఆకర్షణీయమైన గమ్యంగా చూస్తున్నారు. అభివృద్ధిలో ఎవరూ ఆపలేని స్థాయికి నగరం చేరుకున్నది. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుతో ట్రాఫిక్ సమస్య చాలావరకు తగ్గింది. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల్లో నీరు నిండి భూగర్భజలాలు పెరిగాయి. వ్యవసాయరంగం గణనీయంగా వృద్ధి చెందుతున్నది.
రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులపై మీ విశ్లేషణ?
రాష్ట్ర ఏర్పాటుకు ముందు విద్యుత్ సమస్య ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో చిన్నా పెద్దా పరిశ్రమలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రతి పరిశ్రమలో జనరేటర్లు, ఇన్వర్టర్లు సర్వసాధారణంగా ఉండేవి. అంతేకాదు, కోతల కరెంట్‌తో పరిశ్రమలు నడవక కార్మికులు ఉపాధి కోల్పోయేవారు. పారిశ్రామికవేత్తల వ్యాపారాలూ దెబ్బతినేవి. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన కొత్త పారిశ్రామికవాడలు అందుబాటులో లేకపోవడం, హైదరాబా ద్ బ్రాండ్‌ను సరిగ్గా ప్రొజెక్ట్ చేయకపోవడం వల్ల అంతగా పెట్టుబడులు రాలేదని చెప్పవచ్చు. ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఉండేది.
తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం, ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయి? రాష్ట్రం ఏర్పడకముందు ఎలా ఉండేది?
రాష్ట్రంలో పారిశ్రామికరంగం వేగంగా పురోగమించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడమే కారణం. వివిధ పథకాల ద్వారా అందే ప్రోత్సాహకాలే కాకుండా పరిశ్రమలు, వాటి వల్ల ఏర్పడే ఉపాధి అవకాశాల ఆధారంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నది. టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ ద్వారా కొత్త స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తున్నది. నైపుణ్యంగల సిబ్బందిని తయారుచేస్తున్న ది. ఒక పరిశ్రమ రావడంవల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు దానిచుట్టూ భూముల ధరలు పెరుగుతాయి. ప్రోత్సాహకాలు ఒకప్పుడు ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ సహకారం, ఆకర్షణీయ విధానాలు, మౌలిక సదుపాయాల వృద్ధి, టీఎస్ ఐ-పాస్ వంటి చట్టం తీసుకురావడం వల్ల ఇప్పుడు పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి.
ఇతర రాష్ర్టాలతో పోలిస్తే.. తెలంగాణలో అమలవుతున్న పారిశ్రామిక విధానంపై మీ అభిప్రాయం..
భౌగోళికంగా, వాతావరణ పరంగా హైదరాబాద్‌కు కలిసొచ్చే అం శాలు ఎన్నో ఉన్నాయి. మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. అన్నిటినీ మించి శాంతిభద్రతలు బాగున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం, రోడ్డు సౌకర్యం, ఔటర్ రింగురోడ్డు, మెట్రోరైలు, అంతర్జాతీయస్థాయి హోటళ్లు, మాల్స్ ఇవన్నీ హైదరాబాద్‌ను అత్యున్నత స్థాయిలో నిలబెట్టాయి. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో ఒక్క అవాంఛనీయ ఘటన జరగలేదు. బహుశా మరే రాష్ర్టానికీ ఇన్ని అనుకూలతలు ఉండకపోవచ్చు. దీంతో ఒక్కసారి తెలంగాణ కు వచ్చినవారు ఇక్కడే స్థిరపడిపోతున్నారు. తమ పెట్టుబడులను ఇక్కడే విస్తరిస్తున్నారు.
పారిశ్రామికంగా రాష్ట్రంలో ఏఏ రంగాలకు ఎక్కువ అవకాశాలున్నాయి? వాటికి గల కారణాలు?
నీటిపారుదల మెరుగవ్వడంతో సాగు పెరిగింది. దీంతో ఆహార ఉత్పత్తులకు అవకాశాలు పెరిగాయని చెప్పవచ్చు. అలాగే, ప్రధానంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలు అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తున్నాయి. ఐటీ ఎగుమతులు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగాయి. ఫార్మాలో అయితే హైదరాబాద్ ఔషధ రాజధానిగా ఎదిగింది. అనేక వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయి. వీటికితోడు టెక్స్టైల్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలు కూడా బాగానే వృద్ధి చెందుతున్నాయి. ఐటీ రంగం వెస్ట్ హైదరాబాద్ కేంద్రంగా విలసిల్లుతున్నది. ఇప్పుడు ఆదిభట్ల, ఘట్కేసర్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ప్రభుత్వం ద్వితీయశ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరించింది. ఐటీఐఆర్, నిమ్జ్ అందుబాటులోకి వస్తే ఇండస్ట్రీలు మరింత వేగాన్ని పుంజుకుంటాయి.

ఒకప్పుడు…
కర్ఫ్యూలు.. మత కల్లోలాలు..ధర్నాలు.. రాస్తారోకోలు..
కరెంటు కోతలు.. పవర్ హాలిడేలు..
ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌లో చవిచూసిన దుస్థితి ఇది.
నగరవాసులు అనుభవించిన కష్టాలు ఇవి.
మరి ఇప్పుడు…
తెలంగాణ వచ్చాక ఆల్ ఈజ్ వెల్
పవర్ ఫుల్.. పవర్ హాలిడేస్ నిల్..
ధర్నాల్లేవ్.. గడబిడలు అస్సల్లేవ్..
పాతబస్తీ కులాసా.. నగరానికి ధిలాసా
పరిశ్రమలకు దన్ను

తొమ్మిదేండ్లలో అనేక దిగ్గజ బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణకు రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.సుమారు 22.50 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించాయి. టీఎస్ ఐ పాస్, 24 గంటల విద్యుత్తు, మెరుగైన శాంతి భద్రతలు, సుస్థిర ప్రభుత్వం, సమర్థ పాలన వల్లే ఇది సాధ్యమైంది.
– కేసీఆర్
…? ఎస్. కిషోర్