చేయి చేయి కలిపి నడిస్తేనే సమాజాలు విలసిల్లుతాయి. భుజం భుజం కలిపి కష్టపడితేనే సౌధాలు నిటారుగా నిలబడుతాయి. కోనలో కుటీరమైనా, కొండపైన కోట అయినా మనుషుల మధ్య ఐక్యతకు గొప్ప చిహ్నాలే.. ఈ జిల్మాయ పిట్టలు అందంగా అల్లుకొంటున్న గూడు లాగే.. ఇప్పుడు తెలంగాణ బంగారు పోగులు అల్లుకొంటున్నది. ఈ ప్రగతి ప్రస్థానంలో రైతు కూలీ, ఉద్యోగి, నిరుద్యోగి, సామాన్యుడు, మేధావి అన్న తేడా లేకుండా నాలుగు కోట్ల తెలంగాణ యోధులూ సుసంపన్న తెలంగాణ గూడును సున్నితంగా అల్లుతున్నారు. ఈ మహా యజ్ఞంలో తనవంతుగా తెలంగాణను నిత్యం కాచుకొంటున్న యోధ ‘నమస్తే తెలంగాణ’.
తెలంగాణ పోరాట రథంపై రెపరెపలాడిన పతాక నమస్తే తెలంగాణ. మూడు కోట్ల తెలంగాణ ఉద్యమ వీరుల గొంతుకై నిలిచి.. అన్యాయాన్ని అగ్ని జ్వాలై దహించిన బరాటా నమస్తే తెలంగాణ. బంగారు తెలంగాణకు పరుచుకొంటున్న దారిలో సకల జనులకు ముందు నడిచిన కందిలి కాంతి.. ఉద్యమంలో సమైక్యవాదుల కుట్రలను ససాక్ష్యాలతో ప్రజలముందు పెట్టిన కలం బలమే నమస్తే తెలంగాణ. స్వరాష్ట్రంలో స్వచ్ఛమైన ప్రజాభిమానానికి, ప్రేమకు పెట్టింది పేరు నమస్తే తెలంగాణ.. రాబందుల రెక్కల గాలే చల్లని తెమ్మెరలని సామాన్యులు నమ్మకుండా నిత్యం వాస్తవాల వెలుగులు పంచుతున్న వేదిక.. రాష్ట్రసాధన ఉద్యమంలో సైనికుడై పోరాడి, బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తున్న నమస్తే తెలంగాణకు నేడు 11వ పుట్టినరోజు. ఈ పోరాట గడ్డపై చైతన్యం, జ్ఞానం, విజ్ఞానం, న్యాయం, ధర్మానికి గొప్ప వేదికగా సేవలు కొనసాగిస్తానని ఈ సుదినాన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా మరోసారి ప్రతిజ్ఞ చేస్తున్నది.