మొయినాబాద్, డిసెంబర్ 28: విదేశాల్లో విద్యను అభ్యసించాలనేది ప్రతి ఒక్కరి కల అని, అలాంటి వారికి వై యాక్సిస్ అండగా ఉంటుందని వై యాక్సిస్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ రెవెన్యూ పరిధిలో గల విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దినపత్రికల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవేర్నెస్ ఆన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్‌పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఫైజల్ హసన్ మాట్లాడుతూ.. విదేశాల్లో విద్యను అభ్యసించడానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని అన్నారు. బోగస్ కన్సల్టెన్సీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, వాటికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? లేదో ముందుగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నా, ఉద్యోగం కోసం వెళ్లాలనుకున్నా ముందుగా అవగాహన అవసరమని చెప్పారు. వీసా ఎలా పొందాలి, ఇతరత్రా అన్ని అంశాలను వై యాక్సిస్ ఓ మార్గదర్శకంగా నిలుస్తున్నదని చెప్పారు. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు వై యాక్సిస్ కన్సల్టెంట్ ద్వారా శిక్షణ పొందితే భవిష్యత్తులో ఎక్కడకు వెళ్లాలన్నా దగ్గరుండి సహకరిస్తామని తెలిపారు. విద్యార్థుల విదేశీ విద్య కోసం ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దినపత్రికలు సదస్సులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే, అమెరికా తదితర దేశాలకు వెళ్లాలనుకునే వారికే వీసా సేవలను తమ సంస్థ అందజేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో కేజీ రెడ్డి కళాశాల డైరెక్టర్ రోహిత్ కందకట్ల, డాక్టర్ తులసీ ప్రసాద్, తెలంగాణ పబ్లికేషన్ మేనేజర్ టీ గణేశ్, కోఆర్డినేటర్ శ్రీదేవి, అధ్యాపకులు, మూడు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
విదేశాల్లో విద్యను అభ్యసించాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అలాంటి వారికోసం వై యాక్సిస్ కల్పించిన అవగాహన ఎంతో ఉపయోగపడుతున్నది. వీసాలు పొందే విషయంలో చాలా మోసాలు జరుగుతుంటాయి. దీనిపై వై యాక్సిస్ వారు స్పష్టమైన అవగాహన కల్పించారు. విద్యార్థుల కోసం ఇలాంటి సదస్సు ఏర్పాటు చేసిన ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’కు అభినందనలు.
-డాక్టర్ పద్మజ, విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, మొయినాబాద్
ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారికి పూర్తి అవగాహన ఉండాలి. వీసాలు ఇప్పిస్తామని మోసం చేసేవారు చాలామంది ఉంటారు. అన్ని విషయాలు తెలుసుకొని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. -డాక్టర్ సాయిబాబారెడ్డి, విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్