పదేండ్ల కిందటి వరకు ఆ ఊరికి వ్యవసాయమే జీవనాధారం. వరుస కరువులు, ప్రకృతి విపత్తులు వెంటాడేవి. వేసిన పంటలు చేతికొచ్చేదాక నమ్మకం ఉండేది కాదు. ఓ ఏడాది వింత తెగులు పంటలు పాడు చేస్తే.. తర్వాతి సంవత్సరం వడగండ్ల వర్షం కడగండ్లు మిగిల్చింది. దీంతో ఆ ఊరి రైతులు కొత్తగా ఆలోచించారు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయ జీవనాధారం ఉండాలని భావించి.. నిరంతర ఆదాయం వచ్చే పాడి పరిశ్రమ వైపు దృష్టి మళ్లించారు. ఇప్పుడు ఆ ఊరిలో 90 శాతం రైతులకు పాడిసంపదే ఆధారం. ఖర్చులన్నీ పోను ఒక్కో రైతు నెలకు రూ.40 వేలకుపైగా ఆదాయాన్ని పొందుతున్నారు. ఆ ఊరే.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి. అన్నదాతలకు పాల సిరులు కురిపిస్తున్నది.
Sundaragiri | కరీంనగర్, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సుందరగిరి గ్రామం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరిలో 500 మంది రైతులుంటారు. నిజానికి ఇది గతంలో కరువు మండలం. బావులు, బోర్లపై ఆధారపడి మాత్రమే వ్యవసాయం చేసేవారు. అడుగంటిన భూగర్భ జలాలతో అష్టకష్టాలు పడేవారు. వేసిన పంటలు చేతికొచ్చే వరకు నమ్మకం ఉండేది కాదు. పదేండ్ల క్రితం ఆ ఊరిలో వరి పంటకు కొత్త తరహా రోగమొచ్చి దెబ్బతిన్నది. పెట్టుబడులు మీద పడ్డాయి. ఆ కష్టాన్ని దిగమింగుకొని.. మరో పంట సాగు చేశారు. వడగండ్ల వర్షమొచ్చి ఈ పంట కూడా మొత్తం దెబ్బతిన్నది. రెండు పంటలు వరుసగా దెబ్బతినడంతో రైతుల్లో కొత్త ఆలోచన మొదలైంది. వ్యవసాయానికి తోడు పాడిని నమ్ముకోవాలని భావించారు. కొందరు రైతులు వివిధ ప్రాంతాల నుంచి పాడి ఆవులను తెచ్చి పాలు విక్రయించడం ఆరంభించారు.
ఇలా కరువును జయిస్తూ వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకున్నారు. ఇది చూసిన మిగిలిన రైతులు ఒక్కొక్కరుగా పాడిని వ్యవసాయంలో భాగంగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. గ్రామంలో 500 మంది రైతులుంటే 400లకు పైగా రైతు కుటుంబాలు పాడిని నమ్ముకొని జీవిస్తున్నాయి. ప్రస్తుతం 2500 లీటర్ల పాల సేకరణ జరుగుతున్నది. ఇక్కడి నుంచి పాల సేకరణకు కరీంనగర్ డెయిరీతోపాటు ముల్కనూరు, విజయ లాంటి డెయిరీలు పోటీ పడుతున్నాయి. అనేక రకాల సబ్సిడీ స్కీంలను రైతుల కోసం అమలు చేస్తున్నాయి. రోజుకు సుమారు రూ.లక్ష విలువ గల పాల సేకరణ జరుగుతున్నది.
పాల విక్రయం ద్వారా ఈ గ్రామంలో రైతులు నెలకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. అన్ని ఖర్చులూ పోను ఒక్కో రైతు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం లభిస్తున్నది. పది గుంటల వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఇంటిలోనూ పాడి ఆవులు ఉన్నాయి. తెల్లవారగానే.. పాల పొంగులతో నిండిన క్యాన్లను పట్టుకొని డెయిరీ కేంద్రానికి వచ్చే రైతులు కనిపిస్తారు. ఈ గ్రామంలో శ్వేత విప్లవాన్ని చూసిన డెయిరీలు.. ఇక్కడే చిల్లింగ్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశాయి. తాజాగా అకాల వర్షాలకు ఈ గ్రామంలోనూ పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. అయినా సరే.. పాడి అండగా ఉంది కాబట్టి.. పంట నష్టాలకు రైతులు ఆందోళన చెందడం లేదు.
మా ఊరి రైతుల్లో చా లా మార్పు చూడొచ్చు. సమైక్య రాష్ట్రంలో కరువుతో మా గ్రామం అల్లాడింది. అప్పుడు.. రైతులు పాడి బాటపట్టారు. ఒకరిద్దరు రైతులతో మొదలైన పాడి విప్లవం.. ఇప్పుడు గ్రామం మొత్తం విస్తరించింది. భూమి లేని వారు సైతం.. మా ఊరి రైతులు పాడి పశువులను కొనుక్కోవడానికి వెళ్తే.. ఏ బ్యాంకైనా సరే.. లోన్లు ఇట్టే ఇస్తయి. ప్రజలకు స్వచ్ఛమైన పాలు దొరకడంతోపాటు రైతు కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి.
-శ్రీమూర్తి రమేశ్, సర్పంచ్, సుందరగిరి
సుందరిగిరి గ్రామంలో రోజుకు 90 లీటర్లకుపైగా డెయిరీకి పాలు విక్రయిస్తా. అత్యధికంగా పాలు పోసే రైతుల్లో నేను ఒకరిని. పాల విక్రయాల వల్ల నెలకు రూ.లక్ష వరకు అదాయం వస్తున్నది. నాకున్న పది పాడి పశువులకు గానూ దాణా, ఇతర సౌకర్యాలకు నెలకు రూ.40 వేల వరకు ఖర్చవుతున్నది. ఇవి పోనూ.. నెలకు దాదాపు రూ.50 వేల నుంచి రూ.60 వేలు మిగులుతాయి. నాకు మూడెకరాల భూమి ఉంది. దానిని సాగుచేస్తూనే.. పదేండ్లుగా పాడిని నమ్ముకొని ముందుకెళ్తున్నా.
-గైని తిరుపతి, సుందరగిరి పాడి రైతు
నాకు ఐదు పాడి ఆవులున్నాయి. రోజుకు 50 నుంచి 60 లీటర్లు అమ్ముత. నెలకు రూ.80 వేల వరకు ఆదాయం వస్తున్నది. అన్ని ఖర్చులూ పోను నెలకు రూ.50 వేల వరకు మిగులుతున్నయి. గతంలో కరువుతో అల్లాడినం. రైతును బాగుజేయడానికి ఫ్రీ కరెంటు ఇస్తుండ్రు. రైతు బీమా ఇస్తుండ్రు. చెడగొట్టు వానలను ఆపే పని ఎవరి చేతిలోలేదు. అందుకే ఎవుసాన్ని మాత్రమే నమ్ముకుంటే.. ఈ రోజుల్ల లాభం లేదు. పాడిని నమ్ముకుంటే.. ప్రతి పదిహేను రోజులకోసారి పైసలు ఇంటికి వస్తయి.
-మెడబోయిన వెంకన్న,సుందరగిరి పాడి రైతు