కరీంనగర్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లిలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు.. మహిళా రైతు నర్సవ్వ ఆవేదనపై గురువారం ‘నమస్తే తెలంగాణలో’ వచ్చిన కథనం కలకలం రేపింది. దీనిపై స్పందించిన అధికార యంత్రాగం గురువారం కొనుగోళ్లు ప్రారంభించడంతోపాటు.. అక్కడి నుంచి ధాన్యం తరలించే కార్యక్రమాన్ని చేపట్టింది. కాగా తనతోపాటు తోటి రైతులకు జరుగుతున్న ఇబ్బందులను ఎండగట్టిన జంగా నర్సవ్వ కుటుంబ సభ్యులను కొంత మంది కాంగ్రెస్ నాయకులు బెదిరించారు.
దుబాయిలో ఉన్న తన కొడుకుకి ఫోన్‌చేసి.. కొంతమంది నాయకులు బెదిరింపులకు దిగారని జంగా నర్సవ్వ వెల్లడించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. ‘నమస్తే’ కథనంతో కదలివచ్చిన అధికారయంత్రాగం తీరును చూసి.. రైతులు అనందం వ్యక్తంచేశారు.