‘దేశ రాజకీయాలు దీనావస్థకు చేరాయి. సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని అగాథంలోకి నెట్టగా, బీజేపీ పాలనలో విద్వేష, కక్ష రాజకీయాలు పతాకస్థాయికి చేరాయి. ఈ రెండు పార్టీల వల్ల ప్రజానీకం విసుగెత్తిపోయారు. ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రూపంలో అది సాకారమైంది. ఆయన గొప్ప విజనరీ. అడ్మినిస్ట్రేటర్. ప్రజల నాడి తెలిసిన అనుభవశీలి. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ప్రారంభించడం శుభసూచకం. ఆయన లాంటి సమర్థనాయకుడు ఇప్పుడు దేశానికి అవసరం. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రాకను స్వాగతిస్తున్నాం’అరి ఆదర్శ్ లోక్‌కల్యాణ్ సంస్థాన్ (పాట్నా, బీహార్) చైర్మన్ మనోహర్ మానవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ దిక్సూచి అవుతారని, దేశ రాజకీయాల్లో తప్పక రాణిస్తారని అభిప్రాయపడ్డారు. ‘నమస్తే తెలంగాణ’తో ఆయన పంచుకొన్న విశేషాలు..
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంపై మీ స్పందన ?
తెలంగాణ సీఎం రావుసాబ్ను చాలాకాలం నుంచి చూస్తున్నా. రాష్ట్ర సాధన కోసం పలుసార్లు స్వామిఅగ్నివేశ్తో చర్చించారు. ఆ సమయంలో నేను కేసీఆర్‌ను ప్రత్యక్షంగా చూశా. నాయకులను సమన్వయం చేయడంలో, సమస్యలను ఆకళింపు చేసుకోవడంలో, శాశ్వత పరిష్కారం చూపడంలో ఆయ నే సాటి. కేసీఆర్ గొప్ప విజనరీ. మంచి పరిపాలనాదక్షు డు. 8 ఏండ్లలో తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎన్నో మార్పులు తెచ్చారు. క్షేత్రస్థాయి మౌలిక సమస్యలకు పరిష్కారం చూపారు. 24 గంటల విద్యుత్తు, ఇంటింటికీ తాగునీరు, రైతులకు పెట్టుబడి సాయం..ఎన్నో పథకాలు తెలంగాణలో విజయవంతమైనయి. కేసీఆర్ లాంటి సమర్థ నేత ఇప్పుడు దేశానికి కావాలి. కేసీఆర్ రాకను స్వాగతిస్తున్నాం.
ప్రస్తుత దేశ రాజకీయాలపై మీ అభిప్రాయం ?
ఆంగ్లేయుల నుంచి వేరుపడ్డాక దేశం అనుకొన్న రీతిలో అభివృద్ధి చెందలేదు. కాంగ్రెస్, బీజేపీల వల్ల భారత్ తిరోగమనంలో పయనిస్తున్నది. వ్యవసాయమే ఆధారమైనా ఈ రంగాన్ని గాలికొదిలేశారు. పారిశ్రామికంగా మరింత కుంటుపడింది. పేదలు మరింత పేదరికంలోకి వెళ్తుండగా, సంపన్నులు మరింత సంపదను పోగేసుకుంటున్నారు. ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, అనేక సామాజిక జాఢ్యాలతో దేశం నేడు సంక్షుభితంగా మారిపోయింది. ఏ పార్టీ కూడా మౌలిక సమస్యలను పరిష్కరించడం లేదు. చొరవ చూపడం లేదు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు ఆ రెండు పార్టీలను ఎన్నుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి నూతన పార్టీ, సమర్థ నాయకత్వం కావాలి.
దేశప్రగతికి ఎలాంటి అభివృద్ధి అవసరం?
దేశంలో ఇప్పటివరకు వ్యాపారవర్గాలు, కార్పొరేట్లకు మేలు చేసే విధానాలు అమలవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పోటీపడి ప్రజావ్యతిరేక ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నాయి. ప్రజల కలలను సాకారం చేసే నాయకుడు కావాలి. దేశంలో రైతుల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణలోనే. రైతుబంధు, రైతుబీమా, నీటివనరుల వృద్ధి తదితర బహుముఖ ప్రణాళికలతో వ్యవసాయాన్ని బలోపేతం చేస్తున్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు, రాష్ట్ర ఆర్థిక ప్రగతి బ్రహ్మాండంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వ విధానాలు యావత్ దేశానికి అవసరం.
కేసీఆర్ జాతీయస్థాయిలో ప్రభావం చూపగలరా?
ఎలాంటి సందేహం లేదు. రావు సాబ్ గొప్ప నాయకుడు. ప్రత్యేక రాష్ట్రం కోసం పెద్ద పోరాటమే చేశారు. ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నేత. పరిష్కారం చూపగల పటిమ ఉన్నది. అధ్యయనశీలి. తెలంగాణను తీర్చిదిద్దిన విధానమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్, బీజేపీ పాలనతో యువత, మేధావులు, సామాన్య ప్రజానీకం విసుగెత్తిపోయారు. ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. అన్నిరాష్ర్టాల వారు కేసీఆర్ పార్టీ గురించి చర్చిస్తున్నారు. రాబోయే కాలంలో దేశం గొప్ప మలుపు తిరగబోతున్నదని నమ్ముతున్నా. కేసీఆర్‌తో కలిసి నడిచేందుకు ఎదురుచూస్తున్నాం.