ఈ ప్రశ్నలకు బదులేది?
‘నమస్తే’ కథనంపై గురువారం హడావుడి చేసిన కాంగ్రెస్ నేతలు, అధికారులు శుక్రవారం ఎందుకు గప్‌చుప్ అయ్యారు?
నిజంగా కథనంపై విచారణ చేసి ఒప్పందాలు జరిగింది వాస్తవమా, కాదా తేల్చాల్సిన బాధ్యత అధికారులపై లేదా?
తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానన్న ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానంటూ బాలాపూర్ తహసీల్దార్ చెప్తుంటే.. ఫిర్యాదు అందలేదని పోలీసులు ఎందుకంటున్నారు?
ప్రవీణ్‌రెడ్డి ఎవరు? అని గంటల తరబడి ఆరా తీసిన పోలీసులకు అతడి ఆచూకీ లభించలేదా? రైతులతో చేసుకున్న అగ్రిమెంట్ కాపీలోనే అతని చిరునామా, ఆధార్ నంబరు కూడా ఉంది. మరి పోలీసులు దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు?
నిజంగా బిగ్ బ్రదర్స్ ప్రమేయం లేకుంటే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
Telangana | (స్పెషల్ టాస్క్బ్యూరో) అతుల్యం హోమ్స్ ఎవరిది? అసలు ప్రవీణ్‌రెడ్డి ఎవరు?.. ‘బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ గురువారం ప్రచురించిన కథనంతో పోలీసు, రెవెన్యూ శాఖలతో పాటు కాంగ్రెస్ నేతలు జవాబు కోసం శోధించిన ప్రశ్నలవి! ఓ సాధారణ వ్యక్తి ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడం కష్టం.. కానీ ఏకంగా ప్రభుత్వ శాఖలతో పాటు అధికార పార్టీ నేతలు సైతం రంగంలోకి దిగి అనేక మార్గాల్లో సమాధానాన్ని వెతికారు. ఇంతకీ జవాబు దొరికిందా? అంటే ఊదు కాలింది లేదు! పీరు లేచిందీ లేదు! చివరకు అధికార పార్టీ ఎంపీ సైతం కథనంపై విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరినా రెండు రోజుల హైడ్రామా తర్వాత లావుణి పట్టా భూముల కొనుగోలుపై విచారణ చేయాలని పోలీసులకు రెండు రోజుల కిందటే ఫిర్యాదు చేశామని తహసీల్దార్ చెప్తుంటే, అసలు తమకు ఫిర్యాదే అందలేదని పోలీసులు కొట్టి పారేస్తున్నారు. తీవ్ర సంచలనం సృష్టించిన ‘నమస్తే’ కథనంపై ఆదిలో హడావుడి చేసిన అధికారులు ఇప్పుడు గప్‌చుప్ అయ్యారు. అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఒంటి కాలుమీద లేచిన అధికార పార్టీ నేతలు విచారణకే డిమాండ్ చేయడం లేదు. నిజంగా బిగ్ బ్రదర్స్ నీడ లేకపోతే సర్కారు భూములను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కంపెనీ గుట్టురట్టయితే చర్యలుండవా? రెవెన్యూ రికార్డులనే మార్పిస్తానంటూ దర్జాగా ఒప్పందంలో రాసిన వ్యక్తిని అధికార యంత్రాంగం విచారణ చేయకుండా వదిలివేస్తుందా?
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలోని సర్వేనంబరు 92లో సుమారు 291.32 ఎకరాల ప్రభుత్వ భూమిని ల్యాండ్ పూలింగ్ చేసి ఓ కంపెనీ మాటున చెర పట్టేందుకు బిగ్ బ్రదర్స్ ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ గురువారం వెలుగులోకి తెచ్చింది. సమాంతర వ్యవస్థగా ఏర్పడి భూములకు ఎన్వోసీ, పాస్ పుస్తకాలు తెస్తామంటూ అతుల్యం హోమ్స్ డైరెక్టర్ ప్రవీణ్‌రెడ్డి పేరిట రైతులతో ఒప్పందాలు కూడా పూర్తయిన వైనాన్ని ఆధారాలతో సహా ప్రచురించింది. కొన్నిరోజుల కిందటే మాడ్గుల మండలంలోని వందల ఎకరాల కుందారం భూములను కొల్లగొట్టేందుకు జరిగిన ప్రయత్నాన్ని సైతం ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేవడంతో అక్కడి రైతులంతా ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపులు, కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తమ భూములను ఇప్పుడు స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాదర్గుల్ భూములను సైతం కొల్లగొట్టే యత్నాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంతో సూత్రధారులు, పాత్రదారులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏకంగా 300 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని రైతుల నుంచి చవకగా పొందేందుకు కుట్ర రచించడం సామాన్యుడిని సైతం నివ్వెరపరిచింది. అధికార, రాజకీయవర్గాల్లో దీనిపై భారీ ఎత్తున చర్చ జరిగింది. మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడ, నాదర్గుల్ గ్రామాల్లో ఎవరి నోట విన్నా దీనిపైనే చర్చించుకోవడం కనిపించింది.
‘నమస్తే’ కథనం వచ్చిన గురువారం పోలీసులు, రెవెన్యూ అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు సైతం తీవ్రస్థాయిలో హడావుడి చేశారు. కానీ శుక్రవారం సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రైతులతో ఒప్పందం చేసుకున్న అతుల్యం హోమ్స్ డైరెక్టర్ ప్రవీణ్‌రెడ్డి ఎవరు? అంటూ ఆరా తీసి, చివరికి అతడిని కనీసం విచారించిన దాఖలాలు కూడా లేవు. ముఖ్యంగా ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేస్తున్నారనే కథనం వచ్చినందున తాను గురువారమే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాలాపూర్ తహసీల్దార్ ఇంద్రాదేవి తెలిపారు. మీర్‌పేట పోలీసులతో పాటు ఏసీపీ, డీసీపీకి ఫిర్యాదు కాపీలను ఇచ్చామని చెప్తున్న ఆమె.. ఆర్డీవో, కలెక్టర్‌కు కూడా ఈ వ్యవహారంపై లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చినట్టు చెప్పారు. కానీ పోలీసులు మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్తున్నారు. మీర్‌పేట సీఐతో పాటు ఏసీపీ, డీసీపీలను కూడా ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా తమకెలాంటి ఫిర్యాదు రాలేదంటున్నారు. దీంతో తెర వెనుక పావులు ఎంత వేగంగా కదిలాయో అర్థం చేసుకోవచ్చు.
రెండు రోజుల పాటు ఇదే అంశంపై విచారణ చేసిన అధికారులు శుక్రవారం సాయంత్రం గప్‌చుప్ అవడం గమనార్హం. అధికారికంగా బయటికి ఏం చెప్పకున్నా.. అంతర్గత సంభాషణల్లో మాత్రం ఈ భూముల వ్యవహారంలో బిగ్ బ్రదర్స్ పేర్లు వినిపిస్తున్నది నిజమేనని చెప్తున్నారు. కానీ విషయాలు వెల్లడించేందుకు మాత్రం జంకుతున్నారు. తమకు పైనుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని, అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు. పైగా ‘నమస్తే’ కథనంపై విచారణ చేయాలంటూ గురువారమే భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. ‘ఈ ఆర్టికల్ రాసి ప్రభుత్వాన్ని నిందల పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆర్టికల్‌పై విచారణ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీని కోరుతున్నా. ఇప్పటికే ఎక్స్ ప్లాట్‌ఫాంలో కోరిన. రేపు లిఖితపూర్వకంగా అధికారులను కోరుతా. అవాకులు చెవాకులు పేలినది (‘నమస్తే’ కథనం) వాస్తవమైతే కచ్చితంగా అలా కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. లేదా ఇటువంటి తప్పుడు ప్రచారం చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది’ అని వీడియోను విడుదల చేశారు. కానీ చివరికి ఓవైపు తహసీల్దార్ ఫిర్యాదు చేశానని చెప్తున్నా.. పోలీసులు తమకు ఫిర్యాదు అందలేదని అంటున్నారంటే అధికార పార్టీ ఎంపీ డిమాండును కూడా అధికార యంత్రాంగం పరిగణనలోకి తీసుకోవడం లేదని అర్థమవుతున్నది.
‘నమస్తే’ కథనంతో సదరు కంపెనీ నుంచి రావాల్సిన డబ్బులు తమకు రాకుండా పోతున్నాయని ప్రధానంగా రైతులు ఆందోళన చెందుతున్నారని, కానీ ఇలాంటి అనధికారిక ఒప్పందాల వల్ల వారికే నష్టమని రెవెన్యూ నిపుణులు చెప్తున్నారు. లావణి పట్టా భూముల క్రయ, విక్రయాలు నిషేధమని, ఒకవేళ అలా చేసుకుంటే ప్రభుత్వం పీవోటీ కింద వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అందుకే రైతులు ఇలాంటి తాత్కాలిక ప్రయోజనాలకు లొంగిపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్నదని అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండీఏ తరఫున ల్యాండ్ పూలింగ్‌కు కసరత్తు జరిగిందని, అట్ల ప్రభుత్వపరంగా జరిగితే రైతులకు అనధికారిక ఒప్పందాలతో వచ్చే ప్రయోజనం కంటే ఎక్కువ లాభం ఉంటుందన్నారు. ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు, ఎక్కువ విస్తీర్ణం ప్లాట్లు ఇస్తామని చెప్పినా అది నిబంధనలకు విరుద్ధమైనందున భవిష్యత్తులో అభివృద్ధి చేసిన ప్లాట్లపై కొర్రీలు పడతాయని సూచిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికిప్పుడు ప్లాట్లు అమ్ముకొని చేతులు దులుపుకొని పోతాయని, మున్ముందు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తిరిగి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటే రైతులకే నష్టమని ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారి వివరించారు. నాదర్గుల్ భూములకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వపరంగా ల్యాండ్ పూలింగ్‌కు ప్రయత్నిస్తే రైతులకు ప్రయోజనం ఉంటుందని హితవు పలికారు.
‘నమస్తే’ కథనంతో ఉక్కిరిబిక్కిరైన సూత్రధారులు గురువారం ఉదయం నుంచే ఆరా తీయడం మొదలుపెట్టారు. చివరకు పోలీసు శాఖ.. రెవెన్యూ శాఖ సైతం ఉదయం ఆరు గంటల నుంచే రంగంలోకి దిగింది. నగరంలోని పలువురు ‘నమస్తే తెలంగాణ’ రిపోర్టర్లకు ఫోన్లు చేసి అసలు ప్రవీణ్‌రెడ్డి ఎవరు? అతుల్యం హోమ్స్ ఎవరిది? అంటూ పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ చేసి ఆరా తీశారు. ఇంటెలిజెన్స్ విభాగం సైతం ఆదిబట్ల, మీర్‌పేట పోలీసులతో వాకబు చేయించింది. పోలీసులు గుర్రంగూడ గ్రామంలోకి వెళ్లి రైతులు, పలువురు ప్రజాప్రతినిధులను విచారించారు. డీసీపీ స్థాయి అధికారులు రంగంలోకి దిగి పలువురు కార్పొరేటర్లకు ఫోన్లు చేసి ఏం జరుగుతున్నదంటూ కూపీ లాగారు. అప్రమత్తమైన రెవెన్యూ శాఖ వెంటనే రంగంలోకి దిగి భూముల వద్ద ఏమైనా కదలికలు ఉన్నాయా? అని విచారణ నిర్వహించింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా కథనంపై ఆరా తీశారు. అధిష్ఠానం నుంచి ఫోన్లు వస్తున్నాయంటూ పలువురు నేతలు క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకొని సమాచారాన్ని పైకి చేరవేశారు.
ల్యాండ్ పూలింగ్ వ్యవహారం గుట్టు రట్టు కావడంతో సదరు కంపెనీ వ్యక్తులు వచ్చి రైతులను రెచ్చగొట్టినట్టు తెలిసింది. గురువారం ప్రవీణ్‌రెడ్డి కోసం పోలీసులు ఆరా తీస్తుండగానే అదేరోజు మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో రెండు వాహనాల్లో ఆరుగురు వ్యక్తులు గుర్రంగూడకు వచ్చి పలువురు రైతులతో మాట్లాడినట్లు తెలిసింది. ఇందులో ఐదుగురు వ్యక్తులు వాహనాలు దిగి ఒక రైతు ఇంట్లోకి వెళ్లి మాట్లాడగా, మరో వ్యక్తి మాత్రం వాహనం దిగలేదని కొందరు తెలిపారు. వాహనం దిగని వ్యక్తి ప్రవీణ్‌రెడ్డి కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలోకి వారు వచ్చి పోవడం పోలీసులకు తెల్వకుండా ఉంటుందా? అనే ప్రశ్న కూడా రేకెత్తుతున్నది. తమ ఒప్పందం ఎలా లీక్ అయిందంటూ సదరు కంపెనీ ప్రతినిధులు రైతులతో ఆరా తీసినట్టు తెలిసింది. మీడియా సమావేశాన్ని నిర్వహించి, సదరు కంపెనీకి ఎలాంటి సంబంధంలేదని చెప్పాలని, ‘నమస్తే తెలంగాణ’కు వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహించాలని రైతులపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీంతో రైతులు శుక్రవారం మధ్యాహ్నం మీర్‌పేట చౌరస్తాలో ‘నమస్తే తెలంగాణ’ ప్రతులను దహనం చేశారు. అయితే తాము ఆ సార్ (అతుల్యం హోమ్స్ డైరెక్టర్ ప్రవీణ్‌రెడ్డి) వద్దకు వెళ్లిన మాట వాస్తవమేనని, తమ భూములకు పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడంతో ఆయనను ఆశ్రయించామని తెలిపారు. దానికి డబ్బులు అవుతాయని ఆయన చెబితే.. మేం ఇచ్చుకోలేమని చెప్పామని ఒక మహిళా రైతు తెలిపారు. పని కాదంటే తాము మళ్లొచ్చినట్టు చెప్పారు.