హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ ఫొటో చూశారా? ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ‘బిగ్ బ్రదర్స్ కుట్రను ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిన బిగ్ బ్రదర్స్ అండ్ కో అమాయక రైతులను రెచ్చగొట్టేందుకు కుతంత్రాలు పన్నింది. ఇందులో భాగంగా రెండు రోజుల కిందట కొందరు రైతులు, మరికొందరు భూమికి సబంధం లేని వ్యక్తులతో హైదరాబాద్ పరిధిలోని మీర్‌పేట చౌరస్తాలో ‘నమస్తే తెలంగాణ’ ప్రతులను దహనం చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా తెర వెనక ఉన్న అదృశ్య శక్తులతో పాటు అతుల్యం హోమ్స్ డైరెక్టర్ ప్రవీణ్‌రెడ్డి. అందుకే దగ్గర ఉండి రైతులను ఉసిగొల్పి మీర్‌పేట చౌరస్తాలో ‘నమస్తే తెలంగాణ’ ప్రతుల దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పైకి రైతులే స్వచ్ఛందంగా చేసినట్టు చెప్తున్నా, ప్రభుత్వ పెద్దకు చెందిన మీడియాలోనే ఆ గుట్టు రట్టయింది. సదరు కంపెనీ ప్రతినిధులు అక్కడే ఉండి రైతులతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారనేందుకు ఈ దృశ్యమే సాక్ష్యం. ఈ కార్యక్రమంలో పలువురు సంబంధం లేని వ్యక్తులు పాల్గొనడం గమనార్హం.