కోదాడ, నవంబర్ 8: సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన ‘నమస్తే తెలంగాణ’ విలేకరి చిల్లంచర్ల హరికిషన్ (53) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆరు నెలల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని కిమ్స్ దవాఖానలో మృతిచెందారు. హరికిషన్ ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో మునగాల మండల విలేకరిగా 13 ఏండ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలోనూ వివిధ తెలుగు దినపత్రికల్లో పనిచేసి ప్రజా సమస్యను వెలుగులోకి తెచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రఘునాథం ఐదో కుమారుడు అయిన హరికిషన్.. తెలంగాణ ఉద్యమ సమయంలో మునగాల కేంద్రంగా కీలకంగా పనిచేశారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. హరికిషన్ మృతదేహానికి ఆయన స్వస్థలం మునగాలలో ‘నమస్తే తెలంగాణ’ నల్లగొండ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ తొవిటి మహేందర్, ఎడిషన్ ఇన్చార్జి మడూరి నరేందర్, బ్యూరో ఇన్చార్జి మహేందర్రెడ్డి, నివాస్గుప్తా, కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి నారపరాజు కిషన్రావుతోపాటు మండల విలేకరులు నివాళులర్పించారు.