MP Komatireddy Venkat Reddy | నల్లగొండ : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్లగొండ జిల్లాలో కేసు నమోదైంది. చెరుకు సుధాకర్( Cheruku Sudhaker ) కుమారుడు సుహాస్( Suhas ) ఫిర్యాదు మేరకు నల్లగొండ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో 506 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనను చంపుతానంటూ కోమటిరెడ్డి ఫోన్లో బెదిరించారని చెరుకు సుహాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ వెంకట్ రెడ్డితో తనకు ప్రాణహానీ ఉందని సుహాస్ తెలిపారు. వెంకట్ రెడ్డిపై నల్లగొండ జిల్లా ఎస్పీకి కూడా చెరుకు సుహాస్ నిన్న ఫిర్యాదు చేశారు.
‘మీ నాన్న వీడియో చూసినవా? ఇప్పటికే నన్ను వందసార్లు తిట్టిండు. నెలరోజుల నుంచి ఓపిక పడుతున్నా. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి నన్ను విమర్శిస్తాడా? వాడిని వదిలేది లేదు. వాడు (చెరుకు సుధాకర్) క్షమాపణ చెప్పకపోతే మా వాళ్లు చంపుతరు. నా అభిమానులు వంద కార్లల్లో బయల్దేరారు. ఇంటి పార్టీ ఏందిరా? వాడు పీడీ యాక్ట్ కేసులో జైల్లో పడితే నేను ఒక్కడినే వెళ్లి పరామర్శించిన. కౌన్సిలర్‌గా గెలవనోడు నన్ను విమర్శిస్తాడా? 25 ఏండ్ల నా రాజకీయ జీవితంలో లక్షల మందిని బతికించిన. వారిలో చాలామంది ఇప్పటికే వాడి మీద కోపంతో చంపుతామంటూ బయల్దేరారు. నేను ఎంతమందినని ఆపుతా. నిన్ను కూడా చంపేస్తరు. నీ హాస్పిటల్ ఉండదు. వారంలో వాడిని చంపేస్తారు’ అని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చెరుకు సుధాకర్ వర్గీయులతో పాటు కాంగ్రెస్ సీనియర్లు కూడా వెంకట్ రెడ్డిపై సీరియస్ అవుతున్నారు.