నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలానే మరోసారి మోసపూరతమైన మ్యానిఫెస్టోను ప్రకటించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక, క్షేత్ర స్థాయి పరిస్థితులతో సంబంధం లేకుండా ఆచరణకు సాధ్యం కాని అంశాలను మ్యానిఫెస్టోలో పొందుపర్చిందని చెప్పారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్.. రాష్ర్టానికో ఎజెండాను అమలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు.
సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా ఎన్నికల్లో ఓట్లు సాధించడమే పరమావధిగా కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో ప్రగతిశీల పరిపాలన వర్ధిల్లుతున్నదని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో తెలంగాణకు అన్నీ అవమానాలే మిగిలాయని, అందుకు ఆయన మాటలే నిదర్శమని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ మభ్యపెట్టే మాటలు తగవని హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో జరుగుతున్న ఐటీ దాడులు ఎన్నికల్లో భయభ్రాంతులకు గురిచేయడంలో భాగమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారం తలకెక్కి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గడప తొక్కనీయమంటూ చేస్తున్న ఉత్తరకుమార ప్రగల్భాలు మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డికి రెండు సార్లు, వెంకట్‌రెడ్డికి ఓ సారి నల్లగొండ జిల్లా ప్రజలు ఓటమి రుచి చూపారని గుర్తు చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని గుత్తా పేర్కొన్నారు.