హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ) : మౌలిక సదుపాయాల్లో తెలంగాణ రారాజుగా నిలుస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఫలితంగా 2022 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో అన్నిరకాల రోడ్ల పొడవు 1,09,260 కిలోమీటర్లుగా ఉన్నది. ఈ మేరకు బుధవారం గణాంకాల శాఖ వివరాలు వెల్లడించింది. గ్రామాల్లోని రోడ్లతోపాటు మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి రోడ్లను అభివృద్ధి చేశారు.
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు వాటిని జాతీయ,రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేశారు. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా, రెండు లేన్లను నాలుగు లేన్లుగా, ఆరు లేన్లుగా విస్తరించారు. ముఖ్యంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లను అభివృద్ధి చేశారు. ఫలితంగా రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ తదితర శాఖల పరిధిలో అన్నిరకాల రోడ్లు కలుపుకొని మొత్తం 1,09,260 కిలోమీటర్లకు చేరుకున్నాయి. ఇందులో సగానికిపైగా బ్లాక్‌టాప్ రోడ్లు కాగా, మిగిలినవి సీసీ, మెటల్ రోడ్లు. రాష్ట్రంలోని ఆరు జిల్లాలగుండా 30 జాతీయ రహదారులు వెళ్తున్నాయి.
ఆర్అండ్బీ రోడ్ల విషయానికొస్తే, మొత్తం 27,737.21 కిలోమీటర్ల పొడవున విస్తరించివున్నాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 2,217.29 కిలోమీటర్లు, నల్గొండలో 1,836.43 కిలోమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 1,533.65కిలోమీటర్లమేర విస్తరించి ఉన్నాయి. పంచాయతీరాజ్ రోడ్లలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 5,419.89 కిలోమీటర్ల పొడవున ఉండగా, రంగారెడ్డిలో 3,710.55 కిలోమీటర్లమేర విస్తరించి ఉన్నాయి.
ఏ రోడ్డు ఎంత పొడవు(కి.మీ.లలో)
సిమెంటు రోడ్లు : 10,954.77
బ్లాక్‌టాప్ రోడ్లు : 57,820.39
మెటల్ రోడ్లు : 8,827.75
మట్టిరోడ్లు : 31,656.72