నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ శనివారం కాంగ్రెస్‌లో చేరిన ఘటన పార్టీలో చిచ్చురేపుతున్నది. భార్గవ్ కాంగ్రెస్‌లో చేరేందుకు రెండు నెలలుగా ప్రయత్నిస్తుండగా.. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ అడ్డుపడుతున్నారు. సీనియర్ నేత జా నారెడ్డి సైతం జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినా క్షేత్రస్థాయిలో ఫలితం లేదు. దీంతో భార్గవ్ తనతోపాటు మరో 12 మంది కౌన్సిలర్లను వెంటపెట్టుకుని శనివారం ఉదయం గాంధీభవన్‌లో పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిక ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగానే.. స్థానికంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ తమ అనుచరులతో భేటీ అయ్యారు.
తమ అనుమతి లేకుండా, తమకు సమాచారం ఇవ్వకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించడంతోపాటు.. ఆయన చేరికను నిలిపివేయకుంటే పార్టీలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇదే సమయంలో భార్గవ్ చేరికను ఉద్దేశించి ‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గోడలు దూకే నాయకుల్లారా.. ఖబడ్దార్’ అంటూ పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ప్లెక్సీలకు చెప్పుల దండలు వేసి పేడతో కొట్టి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఎవరిని చేర్చుకోవాలన్నా స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయం మేరకే జరుగాలని డీసీసీ అధ్యక్షుడు పీసీసీ పెద్దలకు స్పష్టం చేశారు. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డికి తెల్వకుండా పార్టీ పెద్దలు చేరికలను ప్రోత్సహిస్తే సహించేది లేదని చెప్పారు. దీంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఒక ప్రకటన విడుదల చేయక తప్పలేదు. చేరికలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. స్థానిక నాయకత్వంతో చర్చించాకే తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చేరికల లొల్లి నాగార్జునసాగర్, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో సైతం కొనసాగుతున్నది.