హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): సెలూన్ల వ్యాపారంలోకి రిలయన్స్ సంస్థ ప్రవేశించకుండా కేంద్రం నిరోధించాలని నాయీబ్రాహ్మణ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ డిమాండ్‌చేశారు. నేచురల్ అండ్ స్పా కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ చర్చలు జరుపడంపై ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ మీర్పేట్ చౌరస్తాలో సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రిలయన్స్ సంస్థ దిష్టిబొమ్మను దహనంచేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 వేల సెలూన్లు ఉండగా, 50 వేల మంది వృత్తి చేస్తుండగా, వీటిపై 2 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 75 వేల సెలూన్లు ఉండగా, 10 లక్షల మందికి ఈ వృత్తే జీవనాధారమని వివరించారు. కార్పొరేట్ సంస్థల ప్రవేశం వల్ల వృత్తిదారులంతా రోడ్డునపడే ప్రమాదమున్నదని తెలిపారు. 2009లోనే సెలూన్ల వ్యాపారంలోకి వస్తున్నామని రిలయన్స్ ప్రకటించిందని, ఆనాడు ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్ ఎంతో వ్యతిరేకించి, నాయీబ్రాహ్మణులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. నిరసనలో సంఘం ప్రతినిధులు అన్నందారి చంద్రశేఖర్, చింతల శ్రీనివాస్, మల్లేశ్, ప్రమోద్‌కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.