రామగిరి, మే 15: సింగరేణి రామగుండం-3 డివిజన్ ఓసీపీ-2 వద్ద కెనాల్ మళ్లింపు పనుల్లో భాగంగా సింగరేణి అధికారులు చేపట్టిన బ్లాస్టింగ్ బీభత్సం సృష్టించింది. కాలువలో పెద్ద బండను తొలగించేందుకు అనుమతి లేకుండా బ్లాస్ట్ చేయడంతో సమీపంలోని నాగెపల్లి గ్రామంలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రామగుండం-3 డివిజన్ పరిధిలో రామగిరి మండలం నాగెపల్లిలో ఓసీపీ-2ను సింగరేణి అధికారులు విస్తరిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎస్సారెస్పీ ఎల్-6 కెనాల్ ఉండటంతో మళ్లింపు పనులు చేపట్టారు.
పెద్ద బండరాయి అడ్డురావడంతో గురువారం అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేపట్టారు. పేలుడు దాటికి సమీపంలో ఉన్న నాగెపల్లి గ్రామ సీ బ్లాక్ ఏరియాలో నివాసాలపై పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. బండరాళ్ల తాకిడికి పలువురికి గాయాలయ్యాయి. నివాసాలపై పడటంతో పైకప్పు రేకులు పగిలిపోయాయి. పేలుళ్లకు నిరసనగా గ్రామస్థులు మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై 2 గంటలపాటు బైఠాయించారు. ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇండ్లకు మరమ్మతులు చేపట్టి గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని జీఎం సుధాకర్‌రావు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు. డీజీఎంఎస్, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా సింగరేణి అధికారులు ఎలా బ్లాస్టింగ్ చేస్తారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు. గ్రామాన్ని సందర్శించి, దెబ్బతిన్న నివాసాలను పరిశీలించారు.