న్యూశాయంపేట, జూన్ 13 : గ్రేటర్ పరిధి న్యూశాయంపేట రాజరాజేశ్వర దేవాలయ ప్రధాన అర్చకుడు పానుగంటి నాగేంద్ర మహదేవ్ పురోహిత, అర్చక రంగంలో విశిష్ట సేవలకు తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం అందుకున్నారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక (జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ నిర్వాహకులు రాష్ట్రస్థాయి పురస్కారాలను శనివారం హనుమకొండలోని టీఎన్జీవో భవన్లో అందజేశారు. గత 15 ఏండ్లుగా దేవాలయ అర్చక, పురోహిత రంగంలో ఎంతగానో విశిష్ట సేవలు అందిస్తున్నందున తెలుగు వెలుగు సాహితీ వేదిక నాగేంద్ర మహదేవ్కి తెలుగు వెలుగు సాహితి వేదిక ఫౌండర్, చైర్మన్ బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్ అతిథులతో కలిసి తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం అందజేశారు.
ఈ సందర్భంగా పానుగంటి నాగేంద్ర మహదేవ్ మాట్లాడుతూ.. తెలుగు వెలుగు సాహితీ వేదిక సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇస్తున్న పురస్కారాలకు తనను ఎంపిక చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారంతో తన బాధ్యత మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ పురస్కారం రావడానికి సహకరించిన న్యూశాయంపేట గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ వలబోజు మోహన్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు పొడిసెట్టి విష్ణువర్ధన్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహిత డా.శాంతి కృష్ణ ఆచార్య పాల్గొన్నారు.