Robbery | కాజీపేట/చిల్పూరు, జూన్ 6: నాగర్సోల్ నుంచి నర్సాపూర్ వెళ్తున్న నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. జనగామ జిల్లా నష్కల్-పెండ్యాల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలును ఆపి ఐదు బోగీల్లోని ప్రయాణికుల నుంచి సుమారు 24 తులాల బంగారం, బ్యాగులు, సెల్ఫోన్లను అపహరించుకుపోయారు.
నాగర్సోల్ రైలు బుధవారం రాత్రి 11:50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. నష్కల్-పెండ్యాల్ రైల్వేస్టేషన్ల మధ్య సాంకేతిక పనులు జరుగుతున్న నేపథ్యంలో రైలు 15-20 కిలోమీటర్ల స్పీడ్‌తో మాత్రమే నడుస్తున్నది. దీన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు గురువారం తెల్లవారుజామున 1:10 గంటలకు ఎయిర్ వాల్వ్ విప్పగా రైలు నిలిచిపోయింది. దీంతో కొందరు ఎస్ 2, ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6, ఎస్ 11 బోగీల్లోకి ప్రవేశించి ప్రయాణికుల బ్యాగులు, సెల్ఫోన్లు, మరికొందరు బోగీ కిటికీల వద్ద ఒకరిపై ఒకరు ఎక్కి నిద్రలో ఉన్న వారి మెడల్లోని బంగారం నగలను దొంగిలించారు.
వెంటనే మేల్కొన్న ప్రయాణికులు అరవడంతో కొంతమంది బంగారం వస్తువులను వదలిపెట్టి పారిపోయారు. 17 నిమిషాల తర్వాత రైలు కదిలి కాజీపేట రైల్వే జంక్షన్‌కు చేరుకోగానే కొందరు ప్రయాణికులు.. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు, రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సుమారు 25 తులాల బంగారు ఆభరణాలు దోపిడీకి గురైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా ఎంతమం ది ప్రయాణికుల నుంచి ఎంతెంత బంగారం పో యిందనేది స్పష్టత రాలేదు. ఈ మేరకు రైల్వే పోలీసులు, క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టినట్టు జీఆర్పీ ఎస్సై మోయినుద్దీన్ చెప్పా రు. 12 గ్రాముల బంగారం చైన్‌ను అపహరించుకుపోయారని దంపతులు ఫిర్యాదు చేశారని, మిగ తా బాధితులు ఎవరైనా ఉంటే వారి ప్రాంతంలోని జీఆర్పీలో ఫిర్యాదు చేస్తే.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాజీపేటకు బదిలీ చేస్తారని వివరించారు.