Nagarjuna | నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో సినీ నటుడు అక్కినేని నాగార్జున తన వాంగ్మూలం ఇచ్చేందుకు మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో నాగార్జున తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, వెంకటేశ్వర్లు అట్లా వాంగ్మూలాలను కూడా కోర్టు నమోదు చేయనుంది. సెక్షన్ 356 బీఎన్‌ఎస్‌ను చేర్చుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ రచ్చ శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. పిటిషన్లో తెలిపిన వివరాల ప్రకారం మరికొన్ని సెక్షన్లు జోడించాల్సి ఉంటుందని, వాటి ప్రకారం ఏ కోర్టును ఆశ్రయించాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుందని సూచించారు. మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి పిటిషన్లో పొందపర్చిన విధంగా సెక్షన్లను కూడా జోడించాల్సి ఉంటుందని తెలిపారు. కేవలం ఒక్క సెక్షన్ ప్రకారమే కేసు నమోదు చేయాలని కోరారని పీపీ తెలిపారు. మరోవైపు నష్ట పరిహారాన్ని కోరుతూ మంత్రిపై మరో పిటిషన్ వేసేందుకు నాగార్జున తరఫు న్యాయవాది సిద్ధమవుతున్నారు. మంత్రి కొండా తరఫున టీపీసీసీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు తిరుపతివర్మతోపాటు ఇతర సభ్యులు కోర్టు ఎదుట హాజరయ్యారు.
నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మరికొన్ని రోజుల బెయిల్ పొడిగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం వాదనలు కొనసాగనున్నాయి. ఇప్పటికే 35 రోజులుగా ఆయన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. గుండె సంబంధిత శస్త్ర చికిత్స నిమిత్తం మరికొంత సమయం కావాలని నిందితుడి తరఫు న్యాయవాది కోరడంతో తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు మధ్యంతర బెయిల్లో షరతులే వర్తిస్తాయని కోర్టు పేర్కొంది.