నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)/నందికొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతున్నది. ఏపీకి వెళ్లే కుడికాలువకు దౌర్జన్యం నీటిని పారించుకుంటున్నది. ఇష్టారీతిన రోజుకు వేల క్యూసెక్కుల లెక్కన నీటి విడుదలను పెంచుకుంటూ పోతున్నది. కానీ, తెలంగాణ వైపు ఉన్న ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నది. కాంగ్రెస్ సర్కార్ వైఖరి కూడా ఏపీకే సహకరించేలా ఉన్నదంటూ ఈప్రాంత రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ దౌర్జన్యం కొనసాగుతూనే ఉన్నది. బుధవారం ఉదయం సాగర్ డ్యామ్ నుంచి దౌర్జన్యంగా 500 క్యూసెక్కులతో మొదలైన జలదోపిడీ అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఏకంగా 2,000 క్యూసెక్కులకు పెంచేసింది. తర్వాత రాత్రి 9 గంటల వరకే 4వేల క్యూసెక్కుల నీటి విడుదల పెంచింది. గురువారం సాయంత్రం 6గంటల సమయానికి 7,381 క్యూసెక్కుల నీటిని యథేచ్ఛగా ఏపీ తరలించుకుపోతున్నది. కుడికాలువ సామర్థ్యం 11వేల క్యూసెక్కులు కాగా, మూడో వంతు నీటితో కుడికాలువ నిండుగా పారుతున్నది.
ఈ నీటి తరలింపుపై ఇటు తెలంగాణ సర్కార్‌కు గానీ, అనుమతించాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు గానీ ఏపీ సర్కార్ కనీస సమాచారం కూడా ఇవ్వనేలేదు. పైగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో వాదనకు దిగి హెడ్ రెగ్యూలేటరీ నుంచి అడ్డుకుంటే ఏకంగా కుడికాలువపై ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రం నుంచే నేరుగా జలదోపిడీని కొనసాగిస్తున్నారు. సూపర్ ఎల్ నినో నేపథ్యంలో ప్రాజెక్టులోని నీళ్లను తాగునీటికే వినియోగించాలని తెలంగాణ సర్కార్ చెప్తుంటే.. ఆంధ్ర సర్కార్ మాత్రం తాము దోచుకెళ్తున్న నీటిని తాగునీటికా? లేదా సాగునీటికా? అన్నది నేటికీ ప్రకటించలేదు. పైగా నీటి విడుదల పరిమాణాన్ని మరింత పెంచుకుంటూ శుక్రవారం నాటికి పూర్తిసామర్థ్యంతో కుడికాలువకు నీటిని విడుదల చేయాలన్న పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది.
ఇదే జరిగితే సాగర్‌కు శ్రీశైలం నుంచి వస్తున్న అంతంత మాత్రం ఇన్ఫ్లోనూ వచ్చింది వచ్చినట్టే ఏపీ తరలించుకుపోతున్నట్టు. ఇక సాగర్‌లో నీటిమట్టం పెరుగడమేమో కానీ, ఇప్పటికే ఉన్న నీటిమట్టం కూడా తిరిగి డెడ్‌స్టోరేజీ పడిపోయే ప్రమాదం లేకపోలేదు. రెండు రోజులుగా ఏపీ ఇంత బరితెగింపుతనంతో జల దోపిడీకి పాల్పడుతుంటే.. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అడ్డుకొనే దిశగా ఒక్క అడుగు కూడా వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజులుగా తెలంగాణ సర్కార్ కేఆర్ఏంబీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పుకోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిని కనపరుస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.
కేసీఆర్ హయాంలో..
2015లో ఇలాంటి పరిస్థితులే వస్తే అప్పటి కేసీఆర్ సర్కార్ వానాకాలం పంట రక్షణకు నడుం బిగించి రైతులకు నీళ్లిచ్చిందని రైతులు, రైతుసంఘాల నేతలు గుర్తుచేస్తున్నారు. ఏపీ సర్కార్‌తో గొడవపడుతూ తాగునీటి పేరుతో ఎడమకాలువకు నీటిని విడుదల చేసి నాడు చెరువులు, కుంటలన్నింటినీ నింపినట్టు చెప్తున్నారు. దీంతో ఆనాటి వానాకాలం పంట గట్టెక్కింది. ప్రస్తుతం ఇప్పటికే ఆయకట్టులో రైతులు బోర్లు, బావుల కింద వరిపంట సాగు చేశారు. అది చేతికి రావాలంటే ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలు నింపినాచాలని రైతు లు వేడుకుంటున్నారు. ఆయకట్టు పరిధిలో వారం రోజులుగా రైతులు నీళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్, ఆయన భార్య సొంత నియోజకవర్గాలైన హుజూర్నగర్, కోదాడ ప్రాంతాల్లోనే రైతులు ఆందోళనలకు దిగుతున్నారు.
ఎడమకాలువకు 2,067 క్యూసెక్కులే దిక్కు
ఏపీ సర్కార్ కుడికాలువ ద్వారా గంటగంటకూ నీటి పరిమాణాన్ని పెంచుకుంటూ దోపిడీకి పాల్పడుతుంటే.. తెలంగాణ సర్కార్ మాత్రం ఎడమకాలువకు నీటి విడుదలపై పట్టనట్టే చోద్యం చూస్తున్నది. తొలిరోజు 400 క్యూసెక్కులతో ఎడమకాలువకు నీటి విడుదల మొదలైతే అది గురువారం సాయంత్రం 6 గంటల వరకు కేవలం 2,067 క్యూసెక్కులకే పెరిగింది. ఇదే సమయంలో ఏపీ కుడికాలువకు 7,381 క్యూసెక్కుల నీటిని విడుదలను పెంచుకున్నది. తెలంగాణ ప్రభుత్వం కూడా సాగర్ ఆయకట్టులోని అన్ని చెరువులు నింపడానికి చర్యలు చేపట్టవచ్చు.తాగునీటి రిజర్వాయర్ పేరుతో పెద్దదేవులపల్లికే నీటిని తరలిస్తామని సర్కార్ పెద్దలు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో ఎడమకాలువ ఆయకట్టు రైతులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సూపర్ ఎల్ నినో పేరుతో ఎడమకాలువ ఆయకట్టును ఏకంగా రెండు పంటలనూ ఎండబెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తున్నారు.