చర్ల, అక్టోబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏ, ఆయన అనుచరుడు ఎండీ నవాబ్.. చర్ల, వెంకటాపురానికి చెందిన మరికొందరితో కలిసి తనను హ త్య చేసేందుకు యత్నిస్తున్నారని ఇసుక ర్యాంపు నిర్వాహకుడు కాపుల నాగరాజు ఆరోపించారు. చర్ల మండలం గుంపెనగూడెంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సొసైటీ ఇసుక ర్యాంపుల్లో వాటా అడగడంతోనే వివాదం ఏర్పడిందని తెలిపారు.
మంగళవారం తేగడలో తనపై దాడి జరిగిన తర్వాత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అయితే మళ్లీ రాత్రి తన ఇంటిపైకి వచ్చి కుటుంబ సభ్యులను బెదిరించడంతోపాటు తన గురించి ఆరా తీసినట్టు తెలిపారు. ఈ విషయమై బుధవారం మరోసారి చర్ల సీఐకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. నవాబ్‌తోపాటు మరికొందరు ఇసుక ర్యాంపులో పది శాతం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, లేకుంటే క్యూబిక్ మీటర్‌కు రూ.10 చొప్పున ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తెల్లం దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, ఈ క్రమంలోనే తనపై దాడికి దిగడంతో త్రుటిలో తప్పించుకుని పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు.