సిరిసిల్ల: కష్టపడి చదివింది. పది ఫలితాల్లో (Tenth Results) స్కూల్ ఫస్ట్ వచ్చింది. అయితే ఆమెను విధి వెక్కిరించింది. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమెను లేకుండా చేసింది. ఎందుకంటే పరీక్షలు పూర్తయిన 13 రోజులకు ఆమె అనంత లోకాలకు వెళ్లింది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది.
జిల్లాలోని బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య (Naga Chaitanya-15) అదే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పరీక్షలను ఉత్సాహంగా రాసింది. అయితే అంతలోనే ఏమైందో ఏమో అనారోగ్యానికి గురైంది. పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 17న మరనించింది. అయితే బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్‌గా నిలిచింది. విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు.
పదోతరగతి పరీక్ష ఫలితాల్లోనూ బాలికలే సత్తా చాటారు. బాలికలు 94.26 శాతంతో ప్రతిభ కనబరచగా, బాలురు 91.32 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈసారి పదో తరగతి ఫలితాల్లో మొత్తంగా 92.78 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. నిరుడు 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులవగా ఈ సారి 1.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలను బుధవారం రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. మహబూబాబాద్ జిల్లా 99.29శాతంతో మొదటిస్థానంలో నిలిచింది. సంగారెడ్డి 99.09శాతంతో రెండోస్థానంలో, జనగామ 98.91శాతంతో మూడోస్థానంలో నిలిచింది. జిల్లా పరిషత్ స్కూళ్లల్లో 89.13 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 84.83 శాతం, ఎయిడెడ్‌లో 90.65% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్ బడుల్లో 94.21శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈసారి పదో తరగతి మెమోలపై మార్కులతోపాటు గ్రేడ్లను సైతం ముద్రించారు. ఇంటర్నల్ మార్కులు, థియరీ పరీక్షల్లో వచ్చిన మార్కులను కలిపి మొత్తం మార్కులు వేశారు. సీజీపీఏ గ్రేడ్లను సైతం కేటాయించారు. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు ఈ నెల 16లోపు ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.