హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పోషకాహార భద్రత, సుస్థిర సాగులో చిరుధాన్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ అన్నారు. ప్రపంచంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంద ని, చిరుధాన్యాల ఉత్పత్తిలో దేశం 41% వాటాను కలిగి ఉందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో నాబార్డ్, బిజినెస్‌లైన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో మిల్లెట్స్ కాంక్లేవ్-2023లో ‘ఆహార భద్రత కోసం మిల్లెట్స్’ అంశంపై సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షాజీ మాట్లాడుతూ.. 2030 నాటికి చిరుధాన్యాల ఉత్పత్తి 45 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. చిరుధాన్యాలకు భారతదేశా న్ని గ్లోబల్ హబ్‌గా మార్చడానికి, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ పరిశోధనలు, సాంకేతికతను పంచుకోవడానికి హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అత్యుత్తమ కేంద్రంగా మద్దతునిస్తున్నదని తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా దేశంలో ఒక బలమైన మిల్లెట్ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి కూడా 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని, ఇది దేశంలో చిరుధాన్యాల విస్తరణకు సువర్ణ అవకాశమన్నారు.