హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): వందేండ్ల చరిత్ర గల ప్ర భుత్వ సిటీ కాలేజీ అరుదైన ఘనతను దక్కించుకుంది. దేశంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అత్యధిక గ్రేడ్ పొందిన కాలేజీగా రికార్డు సృష్టించింది. న్యాక్ బెంగళూరు విడుదల చేసిన ఫలితాల్లో 3.67 సీజీపీఏతో ఏ++ గ్రేడ్‌ను దక్కించుకుంది. ఐదేండ్లపాటు ఈ గ్రేడ్ కొనసాగుతుంది. ఇది వరకు ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 3.64 సీజీపీఏ ఏ++ గ్రేడ్‌తో దేశంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అత్యధిక గ్రేడ్ పొందిన కాలేజీగా రికార్డు సృష్టించగా, తాజాగా సిటీ కాలేజీ 3.67 సీజీపీఏతో ఆ రికార్డును అధిగమించింది.
మినీ వర్సిటీ..
సిటీ కాలేజీని మిని వర్సిటీగా చెప్పుకోవచ్చు. ఈ కాలేజీలో డిగ్రీ, పీజీ కలి పి మొత్తం 60 కోర్సులను నిర్వహిస్తున్నారు. 4,500 మందికి పైగా విద్యార్థులుండగా, 125 మంది ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. బీసీ స్టడీ సర్కిల్ సెంటర్‌ను తొలిసారిగా ఈ కాలేజీలోనే నెలకొల్పారు. శిక్షణ పొందిన 90 మంది పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యా రు. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సెల్‌ను ఏర్పా టు చేయగా, ఏటా 50 మంది విదేశాలకు వెళుతున్నారు. సిటీ కాలేజీకి పీహెచ్డీ అర్హత గత ఫ్యాకల్టీ కూడా ఉన్నా రు. కాలేజీ ఫ్యాకల్టీ 350 పుస్తకాలను రచించడమే కాకుండా, వీరికి చెందిన 400కు పైగా పరిశోధనా వ్యాసాలు ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీ య జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. వీటన్నింటితో న్యాక్ గ్రేడ్ మెరుగైంది.
విజ్ఞాన కోవెల..
1908లో మూసీ వరదల బీభత్సం అనంతరం సిటీ కాలేజీని నిర్మించారు. 1921అక్టోబర్ 5న భవనాన్ని నిర్మించగా, ఇప్పటికీ అదే భవనంలో కాలేజీ నడుస్తున్నది. న్యాక్ గ్రేడ్ రావడంతో శనివారం కాలేజీలో సంబురాలు జరుపుకున్నారు. కళాశాల విద్య ఆర్జేడీలు డాక్టర్ యాదగిరి, డాక్టర్ రాజేంద్రసిం గ్, కళాశాల ప్రిన్సిపాల్ బాల భాస్కర్, వైస్ ప్రిన్సిపాళ్లు ఐజాజ్ సుల్తానా, విప్లవ్‌దత్ శుక్లా కేక్ కట్‌చేశారు. న్యాక్ ఏ+ + గ్రేడ్ రావడంపై పూర్వ విద్యార్థులు ఆచార్య హరగోపాల్, డాక్టర్ విద్యాధర్, అనంత మోహన్ హర్షం వ్యక్తం చేశారు. విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన సిబ్బందిని అభినందించారు.