Adilabad | ఆదిలాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా రైతులు పంటను విక్రయించడానికి మార్కెట్ యార్డులో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. తమ ఇంట్లో శుభకార్యాలకు కూడా దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్కు చెందిన జైకృష్ణ, భరత్ సోదరులు. జొన్నలు విక్రయించడానికి ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు శనివారం వచ్చారు. మంగళవారం ఉదయం వరకు వారి పంటను కొనుగోలు కేంద్రాల సిబ్బంది సేకరించలేదు. ఈనెల 8న వారి సోదరుడు హరీశ్ వివాహం ఉండగా, మంగళవారం హల్దీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో వారు పెండ్లి కార్డు పట్టుకుని తమ పంటను కొనాలని అధికారులు, పీఏసీఎస్ సిబ్బంది చుట్టూ తిరగడం కనిపించింది. పంట కొనాలని అడిగితే కొనుగోలు ‘మీరు షెడ్యూల్ ప్రకారం పంటను తీసుకురాకపోవడంతో ఆగాలి’ అని కేంద్రం ఇన్చార్జి అంటున్నారని జైకృష్ణ పేర్కొన్నారు.