ముస్తాబాద్, ఫిబ్రవరి 5 : మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు నింపాలని ఆ మండలంలోని పలు గ్రామాల రైతులు కోరారు. బుధవారం ముస్తాబాద్ పట్టణ అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిబ్రవరి మొదటి వారం ప్రారంభంలోనే ఎండలు ముదరడంతో మండలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా మానేరు కాలువకు ఎగువన ఉన్న గ్రామాల్లోని చెరువులు, కుంటలను మల్లన్నసాగర్ జలాలతో నింపాలని కోరారు. అధిక శాతం రైతులు యాసంగిలో వరి సాగు చేశారని, ఎండ తీవ్రత అధికమైతే నీటి ఎద్దడి ఏర్పడుతుందని పేర్కొన్నారు. పంటలు ఎండిపోకుండా ముందస్తు చర్యలు తీసుకుని చెరువులు, కుంటలు నింపాలని కోరారు. అనంతరం వారు ప్రత్యేక బస్సుల్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని పరిశీలించారు. మండలానికి నీటిని తరలించే స్థాయిలో నీరున్నదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యుడు ఎండీ సర్వర్‌పాషా, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, గూడూరి భరత్, తాళ్ల రాజుతోపాటు రైతులు పాల్గొన్నారు.