
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: తమ సొంత రాష్ట్రంలో, నచ్చిన ప్రాంతంలో పోస్టింగ్ కావాలని అడిగే హక్కు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థులకు లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆలిండియా సర్వీసులకు ఎంపికైన అభ్యర్థి దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నది. ‘క్యాడర్ కేటాయింపు అభ్యర్థి హక్కు కాదు’ అని స్పష్టం చేసింది. కేరళకు చెందిన ముస్లిం, ఓబీసీ అభ్యర్థి అయిన షైనమోల్ 2006లో సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యారు. జనరల్ క్యాటగిరీలో ఆమెకు హిమాచల్ ప్రదేశ్‌లో పోస్టింగ్ ఇచ్చారు. దీనిపై ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనకు సొంత రాష్ట్రంలో, ఓబీసీ క్యాటగిరీలో పోస్టింగ్ ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. అయితే, దీనిపై కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు.. చరిత్రాత్మక మండల్ కేసు తీర్పును ఉటంకించింది. ‘ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు మెరిట్ ప్రకారం జనరల్ క్యాటగిరీ కింద సివిల్ సర్వీసులకు ఎంపికైతే వారికి అన్‌రిజర్వుడు క్యాటగిరీలోనే నియామకాలు ఉంటాయి’ అని గుర్తు చేసింది.