మలక్‌పేట, అక్టోబర్ 1: మూసీనది పరివాహక ప్రాంతం బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల చెప్పారు. మంగళవారం ఆయన మూసానగర్, శంకర్‌నగర్‌లోని మూసీ రివర్ బెడ్లో ఎమ్మార్డీసీ చేపట్టిన కూల్చివేతల ప్రాంతాల్లో పర్యటించారు. పలువురు బాధితులు తమ గోడును ఎమ్మెల్యేకు వినిపించారు. మూసీ బాధితులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదేనని తెలిపారు. పునరావాసం కల్పించిన తర్వాతే నివాసాల తొలగింపు ఉంటుందని పేర్కొన్నారు.
మూసీ నది తీరంలో అక్రమ సర్వే చేస్తున్నారంటూ ఎంఐఎం ప్రతినిధుల బృందం మంగళవారం ఎంఎయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్‌ను కలిసింది. ఎంఐఎం ఎమ్మెల్యేల బృందం తో వెళ్లి మూసీలో నిర్వహించిన అక్రమ సర్వేపై తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు.
పేదలకు పునరావాసం కల్పించాకే మూసీ ప్రక్షాళన చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ బాలమల్లేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లో కలకొండ కాంతయ్య అధ్యక్షతన జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడా బాబుల జోలికి పోకుండా పేదలపై ప్రతాపం చూప డం అన్యాయమని మండిపడ్డారు.