హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): పాకిస్థాన్‌లో కొన్ని వేల కోట్ల రూపాయల మోసాలకు, హవాలా కుంభకోణాలకు పాల్పడిన సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ సంస్థ హైదరాబాద్‌లో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమైన సంస్థ సీఈవో ఒమర్ షెహజాద్ తమ గ్రూప్ చేపట్టిన పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు తమ ఆసక్తిని వ్యక్తపరిచారు. అంతర్జాతీయంగా నేర చరిత్ర కలిగిన ఓ సంస్థ హైదరాబాద్‌లో ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకురావడం, ఆ సంస్థ ప్రతినిధులతో స్వయంగా ముఖ్యమంత్రి సమావేశం కావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సింగపూర్ కంపెనీలను పట్టుకొచ్చేవారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో అమరావతిని సింగపూర్‌లా అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబునాయుడు ఆ దేశపు కంపెనీని ఆహ్వానించి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసిన అనంతరం ఆ కంపెనీ చేతులెత్తేయటం.. అమరావతి పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోవడమూ మనకు అనుభవమే.
హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకొచ్చిన మెయిన్‌హార్ట్ సంస్థకు పాకిస్థాన్‌లో ఎంతో ఘనమైన నేరచరిత్ర ఉన్నది. ఆ కంపెనీ చేసిన మోసాలు ఇంటర్నెట్లో పుంఖానుపుంఖాలుగా లభ్యమవుతున్నాయి. ఈ కంపెనీ పాక్ ప్రభుత్వాన్ని, ప్రజలను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసింది. దీంతో కంపెనీ యజమాని నసీం షెహజాద్, ఆయన కొడుకు, కంపెనీ సీఈవో ఒమర్ షెహజాద్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో స్థానిక ప్రైవేటు బ్యాంకుతో కలిసి వేల కోట్ల రూపాయల మేర ఇండ్ల కొనుగోలుదారులను మోసం చేసినట్టు ఓ కేసు నమోదైంది. మెయిన్‌హార్ట్ సంస్థ 300 కోట్ల మేర హవాలా కుంభకోణానికి పాల్పడినట్టు మరో అభియోగం నమోదైంది. క్రీక్ మెరీనా ప్రాజెక్టు పేరిట పాకిస్థాన్‌లోని మరో ప్రాంతంలో ఇండ్ల కొనుగోలుదారుల నుంచి అడ్వాన్స్‌లు, ఈఎంఐల పేరిట వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేసినట్టు మరో కేసు ఉన్నది. ఈ కేసులో ఇద్దరు బ్యాంకర్లు కూడా నిందితులుగా ఉన్నారు. నసీం షెహజాద్, ఒమర్ షెహజాద్‌లు దేశం విడిచి పారిపోయిన నేరగాళ్లుగా పాక్ ప్రభుత్వం గత నవంబర్‌లో ప్రకటించింది. వీరు పాకిస్థాన్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేశారు. అక్కడి ప్రభుత్వం వీరిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.
మెయిన్‌హార్ట్ ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారని తెలియగానే.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో కార్యక్రమాన్ని హడావుడిగా ముగించుకొని వచ్చి సచివాలయంలో వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నమూనాలు రూపొందించాలని సీఎం ఆ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. అవుటర్ రింగ్‌రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, నగరం చుట్టూ ఏర్పాటయ్యే రైలు మార్గాల విస్తరణతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. వాటికి అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ నమూనాలను రూపొందించాలని సూచించారు. ఒకవేళ ఆ కంపెనీ రూపొందించే నమూనాలు ప్రభుత్వ పెద్దలకు నచ్చితే మూసీ ప్రాజెక్టును ఆ సంస్థకు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పొరుగుదేశంలో ఎన్నో మోసాలు, కుంభకోణాలకు పాల్పడిన సంస్థ గురించి తెలుసుకోకుండానే అధికారులు, ప్రభుత్వ పెద్దలు దానిని హైదరాబాద్‌కు ఆహ్వానించారా? లేక పాకిస్థాన్‌లో జరిగిన మోసాలను ఇక్కడా అనుమతించి.. ప్రజా ధనాన్ని కొల్లగొట్టి వాటాలను పంచుకోవాలన్న ఉద్దేశం ఏమైనా ఉన్నదా? అంటూ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మెయిన్‌హార్ట్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన వారిలో ముఖ్యమంత్రితోపాటు సీఎస్ శాంతికుమారి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలి ఉన్నారు.