Meinhardt | సిటీబ్యూరో, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): సింగపూర్ కంపెనీ మెయిన్‌హార్ట్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్ కన్సార్టియం ఒకటీ అరా కాదు… ఏకంగా ఐదున్నరేండ్ల పాటు మూసీ సుందరీకరణ ఆలనాపాలనా చూడనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు మెయిన్‌హార్ట్ కన్సార్టియంకు ఐదు రోజుల కిందట మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) చీఫ్ ఇంజినీర్ అంగీకార పత్రం ఇచ్చినట్టు సమాచారం.
పత్రంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నట్టు తెలుస్తున్నది. ఏకంగా 66 నెలలపాటు ఇచ్చిన బాధ్యతల్ని నిర్వర్తించాలని అందులో పేర్కొన్నట్టు సమాచారం. రూ.141.08 కోట్లతో(జీఎస్టీ కాకుండా) మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు మాస్టర్‌ప్లాన్ బాధ్యతల్ని అప్పగించేందుకు అంగీకరించినట్టు తెలుస్తున్నది. నెల రోజుల్లోనే ఎంఆర్డీసీఎల్-కన్సార్టియం మధ్య పరస్పర అంగీకారం(ఎంవోయూ) పూర్తి కావాలని గడువు విధించినట్టు సమాచారం.
ఒప్పంద పత్రాన్ని ఈ నెల 5న ఎంఆర్డీసీఎల్ చీఫ్ ఇంజినీర్ జారీ చేయగా… 7వ తేదీన కార్యాలయం నుంచి వెలువడినట్టు తెలుస్తున్నది. మంగళవారం అధికారికంగా మెయిన్‌హార్ట్ కన్సార్టియంకు మూసీ రివర్‌ఫ్రంట్ మాస్టర్‌ప్లాన్ బాధ్యతల అప్పగింత పూర్తయినట్టు సమాచారం. కన్సార్టియం కేవలం మాస్టర్‌ప్లాన్ రూపకల్పన బాధ్యతలు మాత్రమే నిర్వహిస్తుందా? అందుకు ఐదున్నరేళ్లు సమయం ఎందుకు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాస్టర్‌ప్లాన్ రూపకల్పనతోపాటు పర్యవేక్షణ కూడా మెయిన్‌హార్ట్ కన్సార్టియమే నిర్వహించనున్నదా? అనే దానిపై అంగీకార పత్రంలో స్పష్టత లేదు.