Musi River | వికారాబాద్, అక్టోబర్ 16, (నమస్తే తెలంగాణ): దామగుండం అడవుల్లో ఏర్పాటు చేస్తున్న వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రంతో మూసీ నది ప్రమాదంలో పడనున్నది. రాడార్ కేంద్రం మూసీ నదికి మారణశాసనంగా మారుతుందని, ఆదిలోనే ఆ నది అంతమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ నది జన్మస్థానం వికారాబాద్‌లోని అనంతగిరి. అక్కడ ఆ నదికి రెండు వైపులా అడవులుంటాయి. ఒకవైపు దామగుండం, మరోవైపు అనంతగిరి అడవులుంటాయి. వాటిలోని నీటి ఊటలు, చిన్న చిన్న నీటి పాయల సమూహంతోనే నదిగా మూసీ రూపాంతరం చెందుతుంది. రాడార్ కేంద్రం ఏర్పాటుతో అక్కడ నీటి ఊటలు మాయమవుతాయని, భూగర్భజలాలు పూర్తిగా ఎండిపోతాయని, ఫలితంగా మూసీకి నీళ్లు రాక ఆ నది మనుగడే ప్రమాదంలో పడుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
దామగుండం అడవుల్లో రాడార్ కేంద్రం ఏర్పాటుకు 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వమే భూములను ఇచ్చినట్టు సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదు. అప్పట్లో భూములను కేటాయిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ రాడార్ కేంద్రం వల్ల నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు చెప్పడంతో పదేండ్లపాటు ఆ భూములను అప్పగించకుండా పెండింగ్‌లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఒత్తిడి చేసినప్పటికీ ఆ భూములను అప్పగించే ప్రసక్తే లేదని కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడం మూర్ఖత్వమే అవుతుందని పర్యావరణవేత్తలు చెప్తున్నాన్నారు. ఆ కేంద్రం నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావం వల్ల దాదాపు 258 రకాల పక్షిజాతులు, జింకలు, దుప్పిలు, అడవి పందులతోపాటు లక్షల కోట్ల విలువైన అటవీ సంపద నాశనమవుతుందని హెచ్చరిస్తున్నారు.
మూసీని, అటవీ సంపదను కాపాడుకోవాలి
మూసీ నీటితో హైదరాబాద్ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు గతంలో గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశాయాలను నిర్మించారు. నీరు ప్రవహించే ప్రదేశాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నిజాం కాలం నుంచే ఆంక్షలు ఉన్నాయి. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడూ అవే నిబంధనలు కొనసాగాయి. అందుకే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. దామగుండం అడవుల్లో వందల రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. అక్కడ రాడార్ కేంద్రం ఏర్పాటును మానుకోవాలి.
– శుభప్రద్ పటేల్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, వికారాబాద్
మానవ మనుగడకే ముప్పు
పచ్చని ప్రకృతిని, స్వచ్ఛమైన వాతావరణాన్ని నా శనం చేసుకోరాదు. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అనేక రోగాలు వస్తాయి. అక్కడ మానవ మనుగడే ప్రశ్నార్థంగా మారుతుంది. ఏటా అనంతగిరికి ఎన్నో రకాల పక్షలు వలస వస్తాయి. రాడార్ కేంద్రం నుంచి వెలువడే రేడియేషన్‌తో ఆ పక్షులన్నీ అంతరించిపోవడం ఖాయం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడవులను, ఈ ప్రాంత ప్రజలను రక్షించింది.
– బైండ్ల విజయ్‌కుమార్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్, వికారాబాద్
మెడపై కత్తి పెట్టినా ఆ భూములను ఇవ్వలేదు..
గంగానది పుట్టిన గంగోత్రి వద్ద 150 కిలోమీటర్లు ఎకో సెన్సిటివ్ జోన్ అంట. మరీ మూసీ నదికి కనీసం 10 కి.మీ. మేర కూడా ఎకో సెన్సిటివ్ జోన్ లేదా? రాడార్ కేంద్రం ఏర్పాటుకు 2017లో జీవో ఇచ్చినం. కానీ, ఆ రాడార్ స్టేషన్ వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు చెప్పడంతో 2024 వరకూ ఆ భూములను అప్పగించలేదు. కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా ఆ భూముల అప్పగింతను పెండింగ్‌లో పెట్టాం. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు వద్దనుకున్న టెక్నాలజీని మనం ఎందుకు వినియోగించాలని శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. జనావాసాలు లేనిచోట రాడార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. మేం పర్యావరణం కోసం పనిచేశాం కాబట్టే ఆ జీవో అమలును నిలిపివేశాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని పురిట్లోనే ఆగం చేసి కింద మాత్రం మంచి చేస్తామంటే ఎవరు నమ్ముతారు? మూసీ సుందరీకరణ చేపడతామంటున్న చోటే 12 లక్షల చెట్లు నరికివేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఎలా న్యాయం చేస్తారు?
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
గంగానదికి ఉన్న ఆంక్షలు మూసీకి వర్తించవా?
గంగానది పరిసర ప్రాంతాల్లో 150 కిలో మీటర్ల దూరం వరకు ఎలాంటి పరిశ్రమలు, నిర్మాణాలు చేపట్టవదన్న ఆంక్షలు ఉన్నాయి. ఆ ఆంక్షలను మూసి నదికి ఎందుకు వర్తింప జేయడం లేదు? అనంతగిరి, దామగుండం అడవుల్లో ఎన్నో రకాల ఔషధ మొక్కలతోపాటు వందల రకాల జంతువులు, పక్షులు నివసిస్తున్నాయి. రాడార్ కేంద్రం ఏర్పాటుతో అవన్నీ నాశనమవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను అప్పగించలేదు. దామగుండంలో శ్రీరాముడు ఏర్పాటు చేసిన ఆలయానికి రాడార్ కేంద్రంతో ముప్పు ఉందని తెలిసినా బీజేపీ నాయకులు నోరు మెదపడంలేదు.
– చైతన్య కిరణ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, వికారాబాద్
హైదరాబాద్‌లో కూల్చుడెందుకు? వికారాబాద్‌లో నరుకుడెందుకు?
వికారాబాద్ అడవులు హైదరాబాద్‌కు ఆక్సిజన్ సిలిండర్లా ఉన్నాయి. ప ర్యావరణాన్ని కాపాడే ఆ అడవులను నాశనం చేయ డం, సుందరీకరణ పేరుతో మూసీ జన్మస్థలాన్ని నామరూపాలు లేకుండా చేయడం సరికాదు. హైదరాబాద్‌లో కూల్చుడెందుకు? వికారాబాద్‌లో నరుకుడెందుకు? భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలు చేపడుతున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి దామగుండం అటవీ గ్రామల్లోని ప్రజల భవిష్యత్తు కనిపించట్లేదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఏర్పాటుపై ఇప్పటికైనా పునరాలోచన చెయ్యాలి.
– వై గీత, ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర కార్యదర్శి