మూసీ ముసుగులో లూటీ
మూసీ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. కొద్దిమందితోనే గుట్టు చప్పుడు కాకుండా పబ్లిక్ హియరింగ్ జరుగుతుండంతో మూసీ బాధితులు బుధవారం రాజేంద్రనగర్‌లోని వలంతరీకి భారీగా చేరుకున్నారు. కొద్దిమందిని పిలిచి తమలో తమను విభజించి భూములను లాక్కొనేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- భూములు లాక్కుంటే కాంగ్రెస్‌ను పాతరేస్తం
- ఎన్ని సమావేశాలు పెట్టినా భూములిచ్చే ప్రసక్తే లేదు
- ప్రజాభిప్రాయ సేకరణలో తేల్చిచెప్పిన బాధితులు
- ఒకరికి తెలియకుండా మరొకరితో సర్కార్ మీటింగ్
- తమనూ అనుమతించాలని దండెత్తిన బాధితులు
- బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
- సుధీర్‌రెడ్డి, దాసోజు, కార్తీక్‌రెడ్డి, కార్యకర్తల అరెస్ట్
- రాజేంద్రనగర్ వలంతరీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి
- గుట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ .. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : మూసీ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. కొద్దిమందితోనే గుట్టు చప్పుడు కాకుండా పబ్లిక్ హియరింగ్ జరుగుతుండంతో మూసీ బాధితులు బుధవారం రాజేంద్రనగర్‌లోని వలంతరీకి భారీగా చేరుకున్నారు. కొద్దిమందిని పిలిచి తమలో తమను విభజించి భూములను లాక్కొనేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమనూ అనుమతించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితులకు సంఘీభావంగా బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పటోళ్ల కార్తిక్‌రెడ్డి వలంతరీకి చేరుకున్నారు. నాలుగు గోడల మధ్య ఎవరికీ తెలియకుండా ఏ ఉద్దేశంతో సమావేశం నిర్వహించారని ఆయన ప్రశ్నించడంతో పోలీసులు ఆయనను అక్కడినుంచి ఈడ్చుకెళ్లారు. దీంతో అక్కడున్నవారంతా పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ మహేశ్‌యాదవ్, కడారి స్వామి, షేక్‌పేట డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్, కురువ విజయ్ తదితరులను పోలీసులు రాజేంద్రనగర్ వద్ద అడ్డుకున్నారు.
అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయినా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటుండంతో పోలీసులు వచ్చినవారిని వచ్చినట్టు అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహించిన బాధితులు తమకు మద్దతుగా నిలుస్తున్న ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను పాతరేస్తామని తేల్చిచెప్పారు.

Sabitha House Arrest
లాక్కొంటే.. సర్కార్‌ను పాతరేస్తాం
బలవంతంగా తమ భూములు లాక్కోవాలని చూస్తే సర్కార్‌ను పాతరేస్తామని మూసీ బాధితులు హెచ్చరించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు కిస్మత్పూర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, వ్యవసాయ భూముల యజమానుల్లో కేవలం 48మందిని పిలిచారు. అయితే ఎన్ని సమావేశాలు చేపట్టినా తమ భూములు వదులుకోబోమని బాధితులు సమావేశంలో తేల్చి చెప్పారు. సమావేశానికి పిలిచి కేవలం అధికారులే మాట్లాడుకొని వెళ్తున్నారని వారు ఆరోపించారు. తమ భూములతో రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మూసీకి కాదు.. లూటీకి వ్యతిరేకం
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

Sudhir Reddy Arrest
మూసీ బ్యూటిఫికేషన్‌కు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, ఆ ప్రాజెక్టు ముసుగులో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న లూటీకి మాత్రమేనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తేల్చిచెప్పారు. బుధవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతలు బొల్లం మల్లయ్య యాదవ్, ఉపేంద్రాచారి, కురువ విజయ్‌కుమార్, మహేశ్యాదవ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేసిన ప్రభుత్వం మాట వినకుండా నిరంకుశంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. పోలీసులను ముందుపెట్టి బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
డీపీఆర్ లేకుండానే ఆగమేఘాలపై టెం డర్లు పిలువడంలోని ఆంతర్యమేందని ప్రశ్నించిన సుధీర్‌రెడ్డి.. వెంటనే డీపీఆర్ బహిర్గతం చేసి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశా రు. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో రేవంత్‌రెడ్డి చెప్పినట్టే ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.50వేల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. మరి మూసీ ప్రక్షాళనకు కేసీఆర్ ప్రతిపాదించిన రూ.25వేల కోట్లు ఎక్కడ.. రేవంత్ ప్రతిపాదించిన రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడ? అనేది ప్రజలు ఆలోచించాలని సూచించారు.
కరువుతో అల్లాడుతుంటే మూసీ ఎందుకు?: ఎమ్మెల్సీ దాసోజు

Dasoju Arrest
ప్రజలు కరువుతో అల్లాడుతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి మూసీ ప్రాజెక్టును ముందుకు తెచ్చారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. మూసీ ఫేస్-1 కింద కేటాయించిన రూ.7,437 కోట్లలో 30 శాతం దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కరువును ఎదుర్కొనేందుకు ప్రణాళికలు వేయకుండా మూసీ పేరిట ప్రజాధనం లూటీ చేసేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అదానీ, మేఘా లాంటి సంస్థలకు టెండర్లు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
మూసీ ప్రాజెక్టు కోసం చేపట్టిన పబ్లిక్ హియరింగ్ ప్రైవేట్ హియరింగ్గా మారిందని విమర్శించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు రెడ్ కార్పెట్ వేసి స్వాగతించినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. సుధీర్‌రెడ్డి నియోజకవర్గం నుంచే మూసీ పారుతున్నా అనుమతించకపోవడంలోని ఆంతర్యమేందని ప్రశ్నించారు. సర్కార్ నిర్బంధాలతో బీఆర్ఎస్ పోరాటాన్ని ఆపలేరని తేల్చిచెప్పారు. బాధితుల తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ప్రజల గొంతునొక్కడం దారుణం?
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మూసీ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ప్రజల గొంతు నొక్కుతారా? అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్‌లను ఆయన ఖండించారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ప్రజలను విభజించడం దారుణమని ధ్వజమెత్తారు. అభివృద్ధి ప్రాజెక్టుల ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతున్నదని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా ప్రజావ్యతిరేక ప్రాజెక్టులపై వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.
బీఆర్ఎస్ నేతల అరెస్ట్ దుర్మార్గం: హరీశ్
మూసీ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ నేత కార్తిక్రెడ్డిలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ఖండించారు. ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ ఎమర్జెన్సీ తరహా పాలన నడుపడం సిగ్గుచేటని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. సర్కార్ నిర్లక్ష్యంతో కరువు బారిన పడిన రైతులు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోకుండా మూసీ ప్రక్షాళన పేరిట రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. కమీషన్లు దండుకోవడంపై ఉన్న ధ్యాస.. కరువు బాధితులను ఆదుకోవడంపై లేకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు. రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని.. మూసీ ల్యూటీఫికేషన్ కుట్రలను తిప్పికొడ్తారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

