Peddapalli | పెద్దపల్లి, మార్చి 07(నమస్తే తెలంగాణ) : ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏరియాలో మట్టి వెలికితీతకు అనుమతులు తీసుకొని కేజీఎఫ్ తరహాలో పెద్ద ఎత్తున మట్టిని తోడి కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అంతర్గాం మడలం ముర్మూరు వద్ద నిలువ చేశారు. గత 2024 జూన్‌లో పెద్దపల్లి మండలం రాఘవాపూర్ శివారులోని రెండు ఇటీక బట్టీల పేరిట భారీగా తవ్వకాలు చేపట్టారు. ఆ రోజుల్లో భారీగా తవ్వకాలు చేపట్టారనే ఆరోపణలు రావడంతో ఇరిగేషన్ అధికారులు తోడిన మట్టిపై రీసర్వే చేసి గుట్టలు గుట్టలుగా ఉన్న మట్టి నిల్వల సర్వేను చేపట్టారు. అక్రమాలు జరిగినట్లుగా గుర్తించి ఆ మట్టిని సీజ్ చేశారు. అనుమతి తీసుకున్న మట్టికంటే భారీగా అక్రమంగా తవ్వకాలను చేపట్టారని నిర్ధారించి ట్రాన్స్పోర్ట్ అనుమతులను నిలిపివేయడంతో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు మట్టి తరళింపుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ మట్టికి ఇప్పుడు నడకలు వచ్చాయి. నిర్ధేశిత మట్టికంటే అధనంగా ఒక్కో ఫర్మ్ దాదాపుగా 10వేలకు పైగా మెట్రిక్ టన్నుల మట్టిని తీసినట్లు నిర్ధారించి జరిమానా విధించాల్సిందిగా ఇరిగేషన్ అధికారులు సర్వేలు జరిపి జిల్లా మైనింగ్ శాఖకు సర్వే రిపోర్టును అందజేసింది. దీంతో మైనింగ్ అధికారులు మట్టితీతకు అనుమతులు తీసుకున్న రెండు బట్టీల వారికి షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఆ నోటీసులకు సదరు ఇటుక బట్టీల యజమానులు స్పందించలేదు. దీంతో వారికి డిమాండ్ నోటీసులను కూడా ఇచ్చారు.
అప్పుడు నార్మల్‌గా వేసిన జరిమానాను కట్టించుకొని మట్టి రవాణాకు అనుమతులు ఇవ్వాలని వారు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. దీంతో స్పంధించిన జిల్లా కలెక్టర్ పరిశీలించాలని జిల్లా మైనింగ్ అధికారికి లేఖలు పంపడంతో చకచకా ఫైళ్లు కదిలాయి. ఒక్కో ఇటుక బట్టీకి సాధారణ జరిమానా 2లక్షలకు అధనంగా ఐదు రెట్లు అనగా మరో 10లక్షలు చెల్లించి మట్టి తరళించుకోవాల్సి ఉండగా.. వారు రివిజన్‌కు అప్లె చేశారు. ఇక్కడ ఏం జరిగిందో ఏమో కానీ కేవలం రూ. 2లక్షల జరిమానాకే కేవలం రూ. 100ల నోటరీ అఫిడవిట్ సమర్పించడంతో అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ పెనాల్టీని తేల్చకుండానే మట్టి రవాణాకు అనుమతులు ఇవ్వడం పట్ల మైనింగ్ శాఖ అధికారుల పనితీరుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతర్గాం మండలం ముర్మూరు మట్టికి అనుమతులు గోరంత అయితే తవ్వింది కొండంతని ఇరిగేషన్ అధికారులు తేల్చారు. అనుమతులు తీసుకున్న పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన ఎస్హెచ్ఆర్ బ్రిక్స్‌కు చెందిన ఆడెపు శ్రీనివాస్ తొలుత 3,000ల మెట్రిక్ టన్నులకు అనుమతి పొందారు. 2024 మే 22నుంచి జూన్ 5వరకు మట్టి తీతకు అనుమతి ఇచ్చారు. అయితే మే 25న తేదీన చెరువును ఇరిగేషన్ డీఈ తనిఖీ చేయగా అప్పటికే 3వేల మెట్రిక్ టన్నులు తవ్వినట్లుగా గుర్తించి మట్టి తీతను నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో మరో 12, 500ల మెట్రిక్ టన్నుల కోసం మొత్తంగా రూ. 5లక్షల 35వేల వరకు ప్రభుత్వానికి చెల్లించారు. అదే విధంగా ఏఎస్ఆర్ బ్రిక్స్‌కు సైతం 14500ల మెట్రిక్ టన్నుల మట్టి తరళించేందుకోసం రూ. 5లక్షల 30వేల వరకు ప్రభుత్వానికి చెల్లించి అనుమతి తీసుకున్నారు. అక్కడ పెద్ద పెద్ద వాహణాలతో 20వరకు ఎక్స్ కవేటర్లు, 100వరకు టిప్పర్లను పెట్టి పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలను చేపట్టారు.
ముర్మూరులో తోడిన మట్టిని సమీపంలోని సర్వే నెంబర్ 234లో లోతైన ప్రదేశంలో రోడ్డు ప్రక్కన డంప్ చేశారు. అక్కడ స్టాక్ పాయింట్‌కు ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇవ్వడంతో అక్కడ మట్టి స్టాక్ పాయింట్‌ను పెట్టుకున్నారు. ఇక్కడ తవ్వింది తవ్వినట్లుగా మట్టిపోయకుండా పెద్ద ఎత్తున ట్రాక్టర్లు పెట్టి మట్టి కుప్పపై తింపుతూ నేల మట్టంగా చదును చేస్తూ తొక్కించారు. ఇలా చేయడం వల్ల తీసిన మట్టి కొలతలో తీవ్రమైన వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇరిగేషన్ అధికారులు సర్వే చేపట్టారు. వారు చేపట్టిన సర్వే ప్రకారం ఏఎస్ఆర్ బ్రిక్ ఇండస్ట్రీ 39, 500ల మెట్రిక్ టన్నులుగా, ఎస్హెచ్ఆర్ బ్రిక్ ఇండస్ట్రీ 39,500ల మెట్రిక్ టన్నులు నిలువ చేసినట్లు నిర్ధారించారు. అయితే ఈ సర్వేపై సైతం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇక్కడ దాదాపుగా లక్ష యాబై వేల టన్నులకు మట్టి నిల్వలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యధికంగా మట్టి నిల్వలు ఉన్నా.. కేవలం 80వేల టన్నుల మట్టి నిల్వలు మాత్రమే ఉన్నట్లుగా చూపించి ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నట్లు తెలుస్తోంది.
అనుమతికి మించి మట్టిని తోడటంతో ఇరిగేషన్ అధికారులు మట్టి తీతను నిలిపివేయించారు. ఆ సమయంలో సైతం రాజకీయ ఒత్తిడులు జరిగినట్లుగా వినిపించాయి. ఆ తర్వాత మట్టి తీత ఎట్టకేలకు నిలిపి వేసినప్పటికీ ఇరిగేషన్ అధికారులు మాత్రం కొంత కఠినంగా వ్యవహరించడం వల్లే కాస్త ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుండగా.. ఆ ఆదాయానికి సైతం గండి కొట్టే విధంగా మైనింగ్ అధికారులు చకచకా అనుమతులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తున్నది. అనుమతికి మించి మట్టిని తీశారని, ఇరిగేషన్ అధికారులు చేసిన సర్వే ఆధారంగా ఒక్కో బ్రిక్ ఇండస్ట్రీకి రూ. 2లక్షల సాధారణ జరిమానాతో పాటుగా ఐదు రెట్ల ఫైన్ వేయాలని (దాదాపుగా ఒక్కొక్కరికి అధనంగా రూ. 10లక్షలు)నిర్ణయించారు. దీనిపై బ్రిక్ ఇండస్ట్రీస్ రివిజన్‌కు వెళ్లారు. అయితే రివిజన్ నుంచి రిపోర్ట్ రాకముందే మట్టి రవాణాకు అనుమతులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులపై రాజకీయ బత్తిళ్లతో పాటుగా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మట్టి, ఇసుక, ఇతర మైనింగ్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఆదేశాలు ఇస్తున్నా.. పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలు భేఖాతర్ అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మట్టిని పూర్తిగా తరళించుకువెళ్లిన తర్వాత పరిమితికి మించి తోడిన మట్టికి వేసే అధనంగా ఐదు రెట్ల జరిమానాలు ఎలా వసూలవుతుందని, ఈ విషయంలో అధికారులు ఇంత ఉదాసీనంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికైనా రాష్ట్ర మైనింగ్ అధికారులు చొరవ చూపి మైనింగ్ శాఖకు వచ్చే అధనపు జరిమానాలను ముక్కు పిండివసూళ్లు చేసిన తర్వాతే మట్టి రవాణాకు అనుమతులు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ముర్మూరులో నిలువ చేసిన మట్టిని రవాణా చేసేందుకు మైనింగ్ శాఖ రాఘవాపూర్‌లోని వారి ఇటుక బట్టిలకు అనుమతి ఇచ్చింది. ఏఎస్ఆర్ బ్రిక్ ఇండస్ట్రీస్ తరపున ప్రొప్రైటర్ ఏ. సౌందర్యకు 39,500ల మెట్రిక్ టన్నుల మట్టి రవాణాకు గత ఫిబ్రవరి 22నుంచి మార్చి 23వరకు నిర్ణీత నెంబర్లుగల 23లారీలకు ముర్మూర్ నుంచి పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో ఉన్న వారి ఏఎస్ఆర్ బ్రిక్స్‌కు తరళించేందుకు అనుమతులిచ్చారు. అదే విధంగా రాఘవాపూర్‌లోని ఎస్హెచ్ఆర్ బ్రిక్స్ ప్రతినిధి ఆడెపు శ్రీనివాస్‌కు ముర్మూరు నుంచి 40, 780మెట్రిక్ టన్నుల మట్టిని ఫిబ్రవరి 22నుంచి మార్చి 23వరకు నిర్ణీత 22లారీలకు అనుమతులు ఇచ్చింది. ఈ మట్టి తరళింపు ముర్మూరు నుంచి రాఘవాపూర్‌లో గల వారి బ్రిక్ ఇండస్ట్రీస్‌కు మాత్రమే అని ఉత్తర్వుల్లో ఉంది. ఈ మట్టిని ఉదయం 6గం.ల నుంచి సాయంత్రం 5గం.ల వరకు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. మట్టిని తరళిస్తున్న సమయంలో లారీలపై టార్పాలిన్‌ను కప్పాలని నిబంధనలను విధించింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణించి జారీ చేసిన అనుమతులను రద్దు చేస్తామని ఆదేశాలిచ్చింది.
ముర్మూరు నుంచి అనుమతులు పొందిన మట్టిని పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని ఏఎస్ఆర్, ఎస్హెచ్ఆర్ బ్రిక్ ఇండస్ట్రీస్‌కు మాత్రమే తరలించాల్సి ఉండగా నిబంధనలకు విరుద్దంగా ముర్మూరు నుంచి సుల్తానాబాద్, కరీంనగర్‌లకు తరలిస్తున్నారు. జిల్లా మైనింగ్ అధికారులు ఇచ్చిన అనుమతుల్లో ప్రత్యేకంగా ముర్మూరు నుంచి రాఘవాపూర్‌లోని సదరు బ్రిక్ ఇండస్ట్రీస్‌కు అని పేర్కొన్నప్పటికీ బయటికి విక్రయిస్తున్నారు. అదే విధంగా టార్పాలిన్లు లేకుండానే మట్టి రవాణా సాగుతున్నది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే అనుమతులను రద్దు చేస్తామని ఆదేశాలు ఉన్నా వాటిని అనుమతులు పొందిన వారు పట్టించుకోవడం లేదు. పరిశీలించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
ముర్మూరు నుంచి అనుమతులు పొందిన మట్టికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడికైనా తరళించుకోవచ్చు. అనుమతులు ఆ విధంగా ఇచ్చాం. ఆ మట్టిని వారు ఎవరికైనా అమ్ముకోవచ్చు. మట్టి తీత సమయంలో అధనంగా తీశారని ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి చెప్పడంతో ఏఎస్ఆర్, ఎస్హెచ్ఆర్ బ్రిక్స్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. కానీ వాళ్లు స్పందించలేదు. 15రోజుల్లో స్పందించాల్సి ఉండే కానీ వాళ్లు స్పందించలేదు. ఆ తర్వాత డిమాండ్ నోటీసులు ఇచ్చాం. మట్టి తరళింపు కోసం జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు. నార్మల్ జరిమానా రూ. 2లక్షల చొప్పున చెల్లించి అప్పుడు వాళ్లు రివిజన్‌కు వెళ్లారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మట్టి తరళింపుకు అనుతులు ఇచ్చాం. రివిజన్ నుంచి ఆదేశాలు ఎలా వస్తే అలా ఫాలో అవుతామని అఫిడవిట్ ఇచ్చారు. పెనాల్టీ విషయంలో అఫిడవిట్ ప్రకారం నడుచుకోకపోతే చర్యలు తీసుకుంటాం.
-పీ. శ్రీనివాస్, ఏడీ మైనింగ్ పెద్దపల్లి