గూడూరు, ఫిబ్రవరి 13: మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో తల్లీకొడుకును ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం ప్రధాన సెంటర్లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. మండలంలోని బొల్లేపల్లికి చెందిన ఆలకుంట సమ్మక్క (60), కొమురయ్య దంపతులు, కొడుకు ఆలకుంట సమ్మయ్య (40) మంత్రాలు చేస్తున్నారనే నెపంతో అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ శివరాత్రి కుమారస్వామి వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయమై వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
గతంలోనూ కొమురయ్య, సమ్మయ్యపై కుమారస్వామి దాడి చేసి గాయపర్చాడు. సమ్మయ్య వరంగల్లో ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. కుమారస్వామి గూడూరులో ఆటో నడపుకుంటున్నాడు. కూతురు నిశ్చితార్థం ఉండటంతో సమ్మయ్య కుటుంబంతో కలిసి ఐదు రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. కుమారస్వామి గత శనివారం గూడూరులో సమ్మయ్య ఆటోకు అడ్డు తగిలి ‘నాపై మీ కుటుంబం మంత్రాలు చేస్తున్నది’ అని మరోసారి దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో సమ్మయ్య అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆదివారం నిశ్చితార్థం అయిపోవడంతో మంగళవారం తమ ఫిర్యాదు గురించి ఆరా తీసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో పోలీస్ స్టేషన్కు వచ్చి ఇంటికి వెళ్తున్నాడు. దీనిని గమనించిన కుమారస్వామి.. గూడూరు అంబేద్కర్ సెంటర్లో తన ఆటోతో సమ్మయ్య ఆటోను అడ్డగించాడు. వెంటనే ఇనుప రాడ్తో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో సమ్మయ్య (40), తల్లి ఆలకుంట సమ్మక్క (60) అక్కడికక్కడే మృతి చెందారు. కొమురయ్యకు చెయ్యి విరగగా, సమ్మయ్య భార్య రజిత తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నది.
నడిరోడ్డుపై ఇనుప రాడ్తో ఉన్మాదిలా హత్య చేసి పారిపోతున్న కుమారస్వామిని.. కొందరు స్థానిక యువకులు పట్టుకుని స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ఫణీధర్, ఎస్సైలు రాణా ప్రతాప్, నగేశ్, దిలీప్, ప్రవళిక హత్య జరిగిన తీరును పరిశీలించారు. గాయపడిన కొమురయ్యను మహబూబాబాద్ దవాఖానకు తరలించారు. భార్య రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.