కరీమాబాద్ : అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన భార్యను, ప్రియుడిని, వారికి సహకరించిన ప్రియుడి స్నేహితుడు, AR హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్‌ను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 20న డాక్టర్ సుమంత్ రెడ్డి కాజీపేటలోని తన క్లినిక్‌లో డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా బట్టుపల్లి శివారులో SR స్కూల్ దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని ఆయన తండ్రి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వరంగల్ హంటర్ రోడ్‌లోని డాక్టర్ సుమంత్ రెడ్డికి, షిరిడి సాయి నగర్‌కు చెందిన ఫ్లోరా మరియాకు 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది. సంగారెడ్డిలో సుమంత్ రెడ్డి బంధువుల విద్యాసంస్థలు ఉండటంతో వాటిని చూసుకోవడం కోసం 2018 లో ఆయన, ఆయన భార్య ఫ్లోరా మరియా సంగారెడ్డికి షిఫ్ట్ అయ్యారు.
అక్కడ డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డి PHC లో కాంట్రాక్టు పద్ధతిన మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, భార్య ఫ్లోరా మరియా స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుండేది. బరువు తగ్గడం కోసం ఆమె సంగారెడ్డిలోని సిద్దు జిమ్ సెంటర్‌కి వెళ్తుండేది. ఈ క్రమంలో జిమ్ సెంటర్లో కోచ్‌గా పని చేస్తున్న సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని ఆదర్శకాలనీకి చెందిన ఏర్రోల్ల శామ్యూల్ పరిచయం ఏర్పడింది. ఇది ఆ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం సుమంత్ రెడ్డికి తెలవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి.
ఇట్టి గొడవలవల్ల సుమంత్ రెడ్డి తన ఫ్యామిలీని అక్కడి నుంచి వరంగల్‌కు షిఫ్ట్ చేశారు. 2019లో ఫ్లోరా మరియాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. జనగామ జిల్లాలోని పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఆమె లెక్చరర్‌గా ఉద్యోగం చేసేవారు. తర్వాత ఆ కాలేజీ వరంగల్‌లోని రంగశాయిపేటకు మారడంతో సుమంత్ రెడ్డి వరంగల్‌లోని వాసవి కాలనీలో ఉంటూ కాజీపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నాడు. ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి వస్తుండేవాడు. ఫ్లోరా మరియా మాత్రం శామ్యూల్‌తో తరచుగా ఫోన్లో మాట్లాడడం, వీడియో కాల్స్ మాట్లాడడం, సుమంత్ రెడ్డి లేని సమయంలో ఇంటికి పిలిపించుకొని అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం చేస్తోంది.
విషయం తెలియడంతో సుమంత్ రెడ్డికి, ఫ్లోరాకు మళ్లీ గొడవలు మొదలయ్యాయి. దాంతో ఫ్లోరా మరియా, శామ్యూల్‌లు డాక్టర్ సుమంత్ రెడ్డిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. తర్వాత శామ్యూల్ తన స్నేహితుడైన రాజ్ కుమార్ అనే AR హెడ్ కానిస్టేబుల్‌కు విషయం చెప్పాడు. సుమంత్ రెడ్డి హత్యకు సహకరిస్తే సంగారెడ్డిలో ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పాడు. అందుకు AR హెడ్ కానిస్టేబుల్ ఒప్పుకున్నాడు. పదిహేను రోజుల క్రితం శామ్యూల్‌కు ఫ్లోరా లక్ష రూపాయలు ఇవ్వగా ఆయన అందులో రూ.50 వేలు తన ఖర్చులకు ఉంచుకుని మిగిలిన 50 వేలు రాజ్ కుమార్‌కు ఇచ్చాడు.
ఈ నెల 20న మధ్యాహ్నం సంగారెడ్డిలో ఒక సుత్తిని కొనుగోలు చేసిన రాజకుమార్ రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్‌పై బయలుదేరి కాజీపేటకు వచ్చాడు. జనసంచారం లేని చీకటి ప్రదేశాన్ని ఎంచుకొని రెక్కీ నిర్వహించారు. పథకం ప్రకారం డాక్టర్ సుమంత్ రెడ్డి రాత్రి తన క్లినిక్‌ను ముగించుకొని కారులో బట్టుపల్లి రోడ్డు గుండా రంగాశాయపేటకు వెళ్తున్న క్రమంలో తన వెనుక ఫాలో అయ్యారు. బట్టుపల్లి శివారులో SR స్కూల్ దాటిన తరువాత ఉన్న చిన్న బ్రిడ్జి వద్ద డాక్టర్ తన కారు వేగాన్ని తగ్గించగా అదే అదునుగా భావించిన శామ్యూల్ తనతో తెచ్చుకున్న సుత్తితో కారు వెనుక ఇండికేటర్‌ను పగులగొట్టాడు.
ఆ శబ్దానికి డాక్టర్ సుమంత్ రెడ్డి తన కారును పక్కకు ఆపి ఇండికేటర్ వద్దకు వచ్చి చూస్తుండగా శామ్యూల్, రాజకుమార్‌లు సుమంత్ రెడ్డిని విచక్షణారహితంగా కొట్టి, గాయపర్చి, అతడు చనిపోయాడు అని భావించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ కేసును వరంగల్ ACP, నంది రామ్ ఆధ్వర్యంలో మిల్స్ కాలనీ సీఐ వెంకట్రత్నం, టాస్క్‌ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్, మిల్స్ కాలనీ ఎస్సై సురేష్, కానిస్టేబుల్ లు బావ్ సింగ్, చంద్రశేఖర్, వెంకన్న, రాజు జెలెందర్, టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ ఎండి గౌస్, టెక్నికల్ గా సహకరించిన AAO సల్మాన్, ఐటీ కోర్ టీం కానిస్టేబుల్ నగేష్ నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చేధించారు.
ఇట్టి కేసులో నిందితులైన A1 ఎర్రోల్ల శామ్యూల్, A2 గాదె ఫ్లోరా మరియా, రాజ్ కుమార్‌లను పట్టుకొని గురువారం రిమాండ్‌కు పంపించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులను వరంగల్ ACP నందిరామ్ అభినందించారు.