సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 23: తమ తొలి ఓటు కారు గుర్తుకే వేస్తామని యువత స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసించి నేడు హైదరాబాద్, ఇతర మహా నగరాల్లో డిగ్రీ, పీజీలు చదువుతున్న యువతీ యువకులు సుమారు 30 మంది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గంగుల కమలాకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా యువతులు మాట్లాడుతూ.. మహిళలు, యువతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అండగా నిలబడుతున్నారని కొనియాడారు. త్వరలో టీఆర్ఎస్ ప్రచారానికి మరో 150 మంది యువతులు వస్తారని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, సర్పంచ్ శ్రీహరి, పీఏసీఎస్ చైర్మన్ జక్కడి జంగారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లారీ భిక్షం, విద్యార్థినులు బోయిని సుప్రజ, పుచ్చుల అనూష, ఉప్పరగొని కల్పన, మండల మౌనిక, పూలమోని ఇందు, మందుల పవిత్ర పాల్గొన్నారు.