నల్లగొండ : ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ సిబ్బందికి మూడంచెల శిక్షణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ డమ్మీ ఈవీఎంలతో నిర్వహించిన మాక్ కౌంటింగ్ విజయవంతమైంది.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఒకే హాల్లో 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో ఓట్లను లెక్కించి, ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కించనున్నారు. తొలి ఫలితం ఉదయం 9 గంటలకు వెలువడనుంది. చివరి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి వెలువడనుంది.
ఉపఎన్నికలో మొత్తం 2,41,855 ఓట్లకుగాను 2,25,192 ఓట్లు (93.13%) పోలైన విషయం తెలిసిందే. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఎవరిదో తేలాలంటే.. మరికొద్ది గంటలు వేచి చూడక తప్పదు.