ఖైరతాబాద్, అక్టోబర్ 12: అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నింటా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదని ఇప్పటికైనా వివక్ష మానుకోకపోతే ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని మున్నూరు కాపు పటేల్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాంప్రసాద్ పటేల్ హెచ్చరించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్‌తో కలిసి ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలోనే కాదు.. ప్రత్యేక రాష్ట్ర చరిత్రలో మొదటిసారి సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గంలో మున్నూరుకాపులకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు.
బీసీ వర్గాలపై సామాజిక దాడుల వెనుక సీఎం హస్తం ఉన్నదని ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమకు ప్రాతినిధ్యం కల్పించలేదని కనీసం కార్పొరేషన్‌కు నోచుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి జిల్లాకేంద్రంలో బాలబాలికల హాస్టల్ కోసం రెండెకరాల స్థలం కేటాయిస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదని కేవలం అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తూ బీసీలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. గ్రామ, మండల స్థాయిల్లో సభలు ఏర్పాటు చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. సంఘం జెండా, అజెండాలను ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు.