హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): సాధారణంగా ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తాము ఏమేం చేశామో చెప్పుకొంటే, ప్రతిపక్షాలు పాలనలోని లోపాలు ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతుంటాయి. కానీ.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం దీనికి పూర్తి భిన్నంగా జరుగుతున్నది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, కేంద్రంలోని అధికార బీజేపీ కలిసి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. కేసీఆర్‌ను కేంద్రమే అరెస్టు చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిని విమర్శిస్తుంటే, కేసీఆర్‌ను మేమెట్లా అరెస్టు చేస్తాం? నువ్వే అరెస్టు చేయాలంటూ బండి, కిషన్‌రెడ్డి కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని అంటున్నారు. ఇదంతా గమనిస్తున్న పరిశీలకులు.. రెండు పార్టీలది డైవర్షన్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. రెండున్నరేండ్ల పాలనలో ఏం చేశామో చెప్పుకోవడానికి కాంగ్రెస్‌కు ముఖం లేదని, అందుకే ప్రజలు కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపిస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ప్రచారంలో బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నదని చెప్తున్నారు. కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంటే, బీజేపీని ప్రజలు అసలే గుర్తించడం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. దీంతో ఆయన భుజం వీళ్లు, వీళ్ల భుజాలు ఆయన తడుముకొని పబ్బం గడుపుకొంటున్నారని విశ్లేషిస్తున్నారు.
ప్రయోగించని అస్త్రం లేదు..విచారించని ఫైల్ లేదు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ కుటుంబం మీద పన్నని పన్నాగం లేదు, ప్రయోగించని అస్త్రం లేదు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి నుంచి వెతకని ఫైల్ లేదు, విచారణ జరుపని అంశం లేదు, పరిశోధించని కోణం లేదు. అయినా కాళేశ్వరం అంశంలో కేసీఆర్‌ను కనీసం టచ్ చేయలేకపోతున్నారని ప్రజల్లో చర్చ జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే గోదావరి నీళ్లు పారకుండా కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు మూసి వేయించారు. పోలీసులతో విచారణ అని కొంతకాలం, ఎంక్వైరీ కమిషన్ పేరుతో ఇంకొంతకాలం, సీబీఐ కోసం మరి కొంతకాలం ఇలా కాలాన్ని నెట్టుకు రావడం తప్ప కేసు సాగింది ఏమైనా ఉందా? అని ప్రజలు అడుగుతున్నారు. బీడువడ్డ తెలంగాణ భూములు పచ్చని పంటల మాగాణి కావాలనే కేసీఆర్ స్వార్థం మినహా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంకే స్వార్థమూ లేదని కమిషన్లు, విచారణలు తేల్చి చెప్పాయి. అయినా ప్రాజెక్టులో కుంభకోణం జరుగలేదని చెప్పడానికి రేవంత్‌రెడ్డి మనసు అంగీకరించదు. పోనీ.. అవినీతి జరిగిందని చెప్పి కేసీఆర్‌ను ఏమైనా చేద్దామంటే అక్కడ ఏమీ లేదు. ఈ నిర్వేదం నుంచి పుట్టుకొచ్చిన డ్రామానే కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లలని భావిస్తున్నారు.
కాంగ్రెస్ అంతర్గత సర్వేలోనే..
6 గ్యారెంటీలు, 420 హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఓటు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఓటుతోనే వారికి సమాధానం చెప్పాలని నిర్ణయించారు. ఇక బీజేపీని ప్రజలు అసలు గుర్తించడంలేదనే చర్చ జరుగుతున్నది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేయించుకున్న సొంత సర్వేల్లోనే ఉత్తర తెలంగాణలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు తిరుగులేని ఆధిక్యంలో ఉన్నట్టు తేలిందని సమాచారం. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఉమ్మడి మెదక్, ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోని నారాయణపేట్, సూర్యాపేట, ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుస్తుందని, ప్రభుత్వ వ్యతిరేకత ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ సంపూర్ణ ఆధిక్యాన్ని ఆపడం కష్టమని కాంగ్రెస్ అంతర్గత సర్వేలు తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్యవర్తిత్వం చేసి తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి మధ్య లోపాయికారి ఒప్పం దం కుదిర్చారని చర్చ జరుగుతున్నది. దక్షిణ తెలంగాణలో టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, ఉత్తర తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాలని ప్రణాళికలు వేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఏపీ మిత్రపక్షాలు..ఇక్కడ వైరి వర్గాలు
జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షంగా ప్రభుత్వంలో ఉన్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీలు మిత్రపక్షం కాదట. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కూడా ఒంటరిగానే పోటీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 332 స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక అన్నింటికన్నా విచిత్రం ఏమిటంటే పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ అభ్యర్థులను పక్కకు పెట్టి, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోరుతూ తెలంగాణలో ప్రచారానికి వస్తారని అంటున్నారు. సొంత పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనప్పుడు పోటీలో నిలబెట్టింది ఎందుకు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ‘కేసీఆర్‌ను, కేటీఆర్‌ను అరెస్టు చేస్తారని కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే ఇంతవరకు అతీగతి లేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం మీద కమిషన్ వేసి, అవినీతి లెక్కలు తేల్చి, సీబీఐ విచారణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే.. ఈరోజు వరకు సీబీఐ విచారణ ఎందుకు మొదలుపెట్టలేదు. దీనికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి’ – సీఎం రేవంత్‌రెడ్డి ‘రేవంత్ రెడ్డి మా భుజం మీద తుపాకీ పెట్టి ఇతరులను కాలుద్దామంటే, ఆ ట్రాప్‌లో ఇరుకోవడానికి మేం సిద్ధంగా లేం. మీలో రోశం, పౌరుషం చచ్చిపోయిందా? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నానని ఒప్పుకొంటే చెప్పండి.. కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం’ – కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘కేసీఆర్ మీద విచారణ, చర్యలు తీసుకుంటుంటే ఎవరు ఆపారో రేవంత్‌రెడ్డి చెప్పాలి. కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడానికి తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నది మేమా? మీరా? కేసీఆర్ మీద చర్యలు తీసుకునే దమ్మూ ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నదా? చర్యలు తీసుకోలేకపోతే నువ్వు రాజీనామా చెయ్యి’ – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి