హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల మధ్య 16 ఏండ్లలోపు వయసు పిల్లలను సినిమాలకు అనుమతించరాదన్న సింగిల్‌జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలంటూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుచేసింది. గేమ్‌చేంజర్ సినిమా సందర్భంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.
మల్టీప్లెక్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదిస్తూ, ఈ ఉత్తర్వుల వల్ల మల్టీప్లెక్స్ థియేటర్లు నష్టపోతున్నాయని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు.. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.